విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కార్యాలయం ముంబయి తర్వాత హైదరాబాద్‌లోనే ఉండనుందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు. ఆధునీకరించిన హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఆన్లైన్ ద్వారా ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్, అన్ని విదేశీ వ్యవహారాల కార్యాలయాలు ఇక్కడికి రావడం వల్ల ఇంటిగ్రేటెడ్ కార్యాలయంగా మారుతుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ దేశంలోని అన్ని పాస్ పోర్టు కేంద్రాలు సెప్టెంబర్ నుంచి సేవలు అందిస్తున్నాయన్నారు. పాస్‌పోర్ట్ సేవలు అందిస్తోన్న పోస్టాఫీసుల్లో పూర్తి సేవలు పునరుద్ధరించేందుకు... పోస్టల్ విభాగంతో పనిచేస్తున్నామని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు.
కరోనా మహామ్మారి కంటే ముందు నెలకు 10 లక్షల పాస్ పోర్టులను ఇచ్చేవాళ్లమన్నారు. క్రమక్రమంగా మళ్లీ కొవిడ్ ముందున్న స్థాయికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఏర్పడిన కొత్త పరిస్థితులకు అనుగుణంగా విదేశీ వ్యవహారాల కార్యాలయం పనిచేస్తోందన్నారు.
అంతర్జాతీయ ప్రయాణాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. దేశం వెలుపల ప్రయాణాలు సులభతరం చేసేందుకు మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని తెలిపారు. మొబైల్ పోలీస్ వెరిఫికేషన్ యాప్‌ను తెలంగాణ పోలీసులు ఉపయోగిస్తున్నారని, మిగతా రాష్ట్రాలు కూడా ఉపయోగించాలని కోరారు.
పోలాండ్‌లో ఇటీవల చనిపోయిన తెలుగు వ్యక్తి మృత దేహాన్ని తెప్పించటంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో సహాయం చేసిన మురళీధరన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : బోధన్‌లో వీఆర్‌ఏ చెవులు, ముక్కు కోసిన దుండగులు