సచివాలయం భవనాల కూల్చివేత పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. హైకోర్టులో అడ్డంకులు తొలగిపోయిన దృష్ట్యా కూల్చివేత పనులను ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. శుక్రవారం జరిగిన విచారణలో సచివాలయ భవనాల కూల్చివేతకు ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చట్ట విరుద్ధంగా కూల్చివేతలు జరుగుతున్నాయంటూ తెజస ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర రావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై.. కొన్ని రోజులుగా సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు.. పిటిషనర్ వాదనలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
గతంలోనే భవనాల 60 శాతం కూల్చివేత ప్రక్రియ పూర్తైంది. జీ బ్లాక్ పూర్తిగా నేలమట్టం కాగా ఏ, సీ బ్లాకులను కూడా దాదాపు పూర్తిగా కూల్చివేశారు. దక్షిణ హెచ్ బ్లాక్ కూల్చివేత కూడా పూర్తయింది. డీ బ్లాకును 60 శాతం వరకు కూల్చివేశారు. ఉత్తర హెచ్, జే, ఎల్ బ్లాకుల భవనాలను కూడా కొంతమేర కూల్చివేశారు. హైకోర్టు తీర్పు వచ్చిన కాసేపటికే.. మళ్లీ కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది.