గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, స్ట్రీట్ హాకర్స్ అసోసియేషన్ ప్రకటించించాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్.. సికింద్రాబాద్‌లోని రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయానికి వెళ్లి తెరాసకు మద్దతు ఇవ్వాలని కోరారు.
వినోద్ కుమార్ విజ్ఞప్తి మేరకు మజ్దూర్ యూనియన్‌లో చర్చించుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు పార్టీకి మద్దతు ఇవ్వాలని యూనియన్ కేంద్ర కమిటీ కార్యదర్శి శంకర్ రావు, నాయకులు యాదవ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో వినోద్ కుమార్ కలిసిన స్ట్రీట్ హాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు మద్దతునిస్తూ తీర్మానం కాపీని అందజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 26న చేపట్టనున్న సార్వత్రిక సమ్మె పోస్టర్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెరాస కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, ప్రధాన కార్యదర్శి నారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు