తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పెరగకుండా కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేయడం ఉపయోగపడుతుందని దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan rao) అన్నారు. దీన్ని నీటి కేటాయింపుల విషయంగా చూడకూడదని దిల్లీలో స్పష్టం చేశారు. ఇప్పటికే కేటాయించిన నీటిని బోర్డుల ద్వారా జరిగే నిర్వహణగా చూడాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి, అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని పరస్పరం కేంద్రానికి లేఖలు రాస్తున్న నేపథ్యంలోనే కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం.. వివాదాలు పెద్దవి చేయకూడదనే కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పారు.
నదీ జలాల విషయాన్ని తెలంగాణ రాజకీయం చేయాలనుకుంటుందని విమర్శించారు. తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో ఏడేళ్లు మాట్లాడకుండా ఉన్నారని అన్నారు. 2015లో కృష్ణ నదీ జలాల వాటాను ఏపీకి 66 శాతం తెలంగాణాకి 34 శాతానికి హరీశ్ రావు ఒప్పుకున్నారు కాబట్టే ఇప్పుడు కేంద్రాన్ని అడగడానికి మెహం చెల్లడం లేదని ఎద్దేవా చేశారు. నీటి విషయంలో తెలంగాణ భాజపాను బద్నాం చేయాలని తెరాస చూస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, సమస్యల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ముందుకు వచ్చి తెలంగాణ తమ వాదాన్ని వినిపించాలని కోరారు. ఇప్పటి వరకు జల వివాదాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదన్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటే మాటమార్చి సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా స్వాగతిస్తామని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
ఉభయరాష్ట్రాల మధ్య అనవసర గొడవ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నీటి వివాదం తెరపైకి తీసుకొచ్చారు. గత కొద్ది రోజులుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. 2015 సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 66:34 నిష్పత్తిలో భాగంగా తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అగీకరించారు. ఇప్పుడు మేల్కొన్న సీఎం 50:50 వాటా కోసం కొట్లాడతాం అనడం, అవసరమైతే కోర్టుకు వెళ్తానని అనడం స్వప్రయోజనాల కోసమే.
-రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే
ఇదీ చదవండి: Revanth Reddy: 'ఎంతమందిని అరెస్టు చేసినా ర్యాలీ చేసి తీరతాం'