మనసు ప్రశాంతంగా ఉంటేనే లక్ష్యాన్ని సాధించగలుగుతామని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. గెలుపు సులువుగా రాదని... శారీరకంగా, మానసిక శ్రమించాల్సిందేనని పేర్కొన్నారు. కన్హశాంతివనంలో జరిగిన 14వ జాతీయ స్థాయి వ్యాసరచన పోటీ విజేతల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. క్రీడాకారులకు ఏకాగ్రత చాలా అవసరమని... అది ధ్యానంతో సాధించవచ్చునని సింధు తెలిపారు.
హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన సంస్థ... యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఇండియా, భూటాన్ సంయుక్తంగా... దేశవ్యాప్తంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 25 వేల విద్యాసంస్థల నుంచి పది లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఎంపికైన 12 మందికి బహుమతులు ప్రదానం చేశారు. హార్ట్ ఫుల్ నెస్ 75వ వార్షికోత్సవం సందర్భంగా పలు కార్పొరేట్ సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు.