Telangana Congress : కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్నినింపి సానుకూల వాతావరణాన్ని ఏర్పరిచాయి. తెలంగాణాలో కూడా పార్టీ గెలుస్తుందన్న విశ్వాసం నాయకుల్లో వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమాను నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నేతల మధ్య ఐక్యత కొరవడింది.
Telangana Congress Conflicts : నాయకుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు కాంగ్రెస్ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి. వారి వెంట కార్యకర్తలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఒక నాయకుడి వెంట వెళ్లితే.. మరొక నేతకి కోపం ఉంటోంది. దీంతో క్యాడర్, సానుభూతిపరులు మౌనం పాటిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ఈ పరిస్థితులను చక్కబెట్టేందుకు తక్షణమే.. రాష్ట్ర నాయకత్వం దృష్టిసారించాల్సి ఉంది.
నేతల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు: ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు సీనియర్ నేతలు.. రాష్ట్రంలోని నాయకుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలను పూర్తి స్థాయిలో తొలిగించేందుకు పని చేయాల్సి ఉంది. బూత్ స్థాయి, మండల స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ ఇవి సమసిపోవాల్సి ఉంది. అది జరిగి నాయకుల మధ్య ఉన్న విభేదాలు తొలిగితేనే శ్రేణులు స్వేచ్ఛగా వారి వెంట తిరగలుగుతారు.
క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఇప్పటికైనా దృష్టిసారించకపోతే కార్యకర్తల్లో సైతం అభద్రతభావం తొలిగిపోదు. మరొవైపు కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో కొంత సానుకూల వాతావరణం ఏర్పడడంతో.. ఇతర పార్టీల నుంచి వలసవచ్చే నేతల సంఖ్య భారీగా ఉంటుందని పీసీసీ అంచనా వేస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో, బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు కొందరు రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
లాభనష్టాలను అంచనా వేసుకుని : అయితే ఈ విషయంలో ఆచితూచి అడుగులు ముందుకు వేయాల్సి ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ జెండా మోస్తున్న వారిని పక్కన పెట్టి.. ప్యారాచూట్‌తో ఇప్పటికిప్పుడు బయటి నుంచి వచ్చే వారికి ప్రాధాన్యత ఇస్తే.. తీవ్ర గందరగోళం ఏర్పడతుందని వారు అంటున్నారు. సీనియర్ నేత జానారెడ్డి ఛైర్మన్‌గా ఏర్పడిన చేరికల కమిటీ ద్వారా.. పార్టీలోకి వచ్చే నాయకుల వల్ల లాభనష్టాలను అంచనా వేసుకుని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం అవసరమని పేర్కొంటున్నారు.
రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో ఉన్న పలువురు నేతలు : ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పార్టీ చర్చలు జరిపినప్పటికి.. వారి చేరికపై స్పష్టత రావాల్సి ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. వీరుకాకుండా మరికొంత మంది నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇటీవల పార్టీని వీడి బీజేపీ, బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన నాయకులు పలువురు అసంతృప్తిగా ఉంటున్నట్లు హస్తం వర్గాలు చెబుతున్నాయి. వారిలో కూడా పలువురు నాయకులు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో ఉంటూ.. సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ కసరత్తు : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయం మరింత వేగం పుంజుకుంటుంది. జూన్ రెండో తేదీన సికింద్రాబాద్ గాంధీజీ ఐడియాలజీ కేంద్రంలో జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించాలని పీసీసీ నిర్ణయించింది. సోనియా, ప్రియాంక గాంధీల పర్యటన ఖరారైతే.. పార్టీలో చేరనున్న ముఖ్య నాయకులను వారి సమక్షంలోనే కండువా కప్పేందుకు పీసీసీ కసరత్తు చేస్తోంది.