ఏపీ గుంటూరు జిల్లాలో వరద కారణంగా ఓ గర్భిణీ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అవస్థలు పడ్డారు. కొల్లూరు మండలం ఈపూరు లంకకు చెందిన గర్భిణీకి ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. ఆసుపత్రి వెళ్లేందుకు ఏ దారి లేదు. గ్రామంలోకి వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. 108 వాహనం గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. పోలీసులు తాళ్ల సాయంతో ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అది ప్రమాదమని గ్రహించి అందుకు సాహసించలేదు.
నొప్పులు ఎక్కువ కావడం వల్ల స్థానికుల సహకారంతో గ్రామంలోనే కాన్పు చేశారు. కాన్పు అనంతరం తాళ్ల సాయంతో తల్లిని, బిడ్డను పోలీసులు ప్రవాహం దాటించారు. అప్పటికే 108 సిద్ధంగా ఉంచారు. తల్లి, బిడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కొల్లూరు ఎస్సై ఉజ్వల్ కుమార్ ఈ వ్యవహారంలో చొరవ తీసుకున్నారు. గ్రామస్థులు పోలీసులను ప్రశంసించారు. అలాగే కాన్పుకు సహకరించిన మహిళకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: విలయం... వాయుగుండంతో రాష్ట్రంలో విధ్వంసం