కొత్త తరహా సేవలు అందించే దిశలో తపాలాశాఖ ముందుకు వెల్లుతోంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు కోరుకునే సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ... బ్యాంకింగ్ రంగంతో పోటీ పడేందుకు యత్నిస్తోంది. క్షేత్ర స్థాయిలో గ్రామాల వరకు తపాలా శాఖ విస్తరించి ఉండడంతో కొత్త రకం సేవలు ఏవైనా త్వరితగతిన ఆకలింపు చేసుకుని ప్రజలకు చేరువగా తీసుకెళ్లగలుగుతున్నాయి. బ్యాంకింగ్ రంగం మాదిరిగా ప్రజల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం, అవసరమైనప్పుడు వారి ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడం, జీవిత బీమా, రికవరింగ్ డిపాజిట్లు సేకరించడం, ఏటీఎంల సేవలు అందుబాటులోకి తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బాలిక సాధికారిత కార్యక్రమంలో భాగంగా సుకన్య సంవృద్ధి యోజన పథకాన్ని జనంలోకి తీసుకెళ్లడం లాంటి సేవలు అందిస్తోంది. వాటితోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆధార్, పాస్ పోర్టు సేవలను కూడా తపాలాశాఖ సమర్థవంతంగా అందిస్తోంది.
తెలంగాణలో 45 గ్రామాలను ప్రత్యేకంగా ఎంచుకుని వందశాతం సుకన్య సంవృద్ధియోజన, మరో 25 గ్రామాల్లో వందశాతం జీవితబీమాను తపాలా శాఖ అమలు చేస్తోంది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి జనంలో చైతన్యం తీసుకొచ్చి ఆయా పథకాలు సమర్ధవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. 45 గ్రామల్లో పది సంవత్సరాలలోపు వయసున్న ఆడపిల్లల పేరున 7,149 ఎస్‌ఎస్‌ఏ ఖాతాలను తెరిపించగా, సేవింగ్స్ ఖాతాలు, రికవరింగ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌లకు చెందిన మరో 9,523 ఖాతాలను తెరపించినట్లు పోస్టు మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి వివరించారు. 25 గ్రామల్లో వందశాతం జీవితబీమా చేయించడంలో భాగంగా 5,164 మంది ఈ పథకంలో భాగస్వామ్యులయ్యారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో తపాలశాఖ వివిధ సేవలు అందించడంలో... బ్యాంకులతో పోటీపడుతోంది. ఆధార్, పాస్ పోర్టు సేవలతోపాటు.. సుకన్య సంవృద్ధి యోజన, పీపీఎఫ్ లాంటి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఇక్లూసిన్ మెరుగు పరిచేందుకు అవకాశం ఉన్న.. అన్ని మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నాం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వచ్చే ఏడాది జనవరి చివరినాటికి రాష్ట్రంలో.. మరో 418 బ్రాంచి కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం.
పి.వి.సుబ్బారెడ్డి, పోస్టు మాస్టర్ జనరల్
రాష్ట్రంలో 14తపాలా కార్యాలయాల ద్వారా 2.06లక్షల పాస్‌పోర్టులు, 282 తపాలాకార్యాలయాల ద్వారా 6.52లక్షల మంది ఆధార్ అప్‌డేషన్లు, ఎన్‌రోల్‌మెంట్లతోపాటు వ్యాక్సినేషన్ కోసం 62వేల మంది పోస్టు ఆఫీసుల ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ల కింద ప్రతి నెల రూ.450 కోట్లు మొత్తాన్ని 5,578 ప్రాంతాల్లో 21లక్షల మంది లబ్దిదారులకు అందచేయడంలో తపాలా శాఖ కీలకపాత్ర పోషిస్తోంది. మరోవైపు 26లక్షల మంది ఎన్‌ఆర్జీఎస్ కూలీలకు చెందిన రూ.86 కోట్లు మేర వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం కింద రూ.1,303 కోట్లు లబ్దిదారులకు చేరవేసినట్లు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తపాలా శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'పోస్ట్ ఇన్ఫో'తో ఔషధాలు, మాస్కులు డోర్ డెలివరీ