రాష్టంలోని 905 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు స్థానికంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల ఆరో తేదీ నుంచి 8 వరకు నామపత్రాలు స్వీకరించనున్నారు. తొమ్మిదిన నామపత్రాల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు పదో తేదీతో గడువు ముగుస్తుంది. 15న పోలింగ్ నిర్వహించి... అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. పీఏసీఎస్‌లకు ఆఫీసు బేరర్లను 16న ఎన్నుకుంటారు.
ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై అధికారులతో సమీక్ష
సహకార ఎన్నికల నేపథ్యంలో 32 జిల్లాల సంయుక్త కలెక్టర్లు, జిల్లా సహకార అధికారులతో వ్యవసాయ, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి... బీఆర్కే భవన్ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా బదిలీ అయిన జనార్దన్ రెడ్డి, సహకార శాఖ రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్యతో పాటు ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై సమీక్షించిన పార్థసారధి... అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, రవాణా సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా శాంతిభద్రతలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.