Opposition Parties fight against BRS in Telangana : కన్నడ నాట కాంగ్రెస్ విజయదుందుభి మోగించడంతో ఆ పార్టీలో కొత్త ఊపు వచ్చింది. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామనే ధీమా హస్తం పార్టీతో పాటు.. విపక్ష పార్టీల్లోనూ నెలకొంది. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బీఎస్పీ, వైఎస్ఆర్టీపీ, తెలంగాణ జనసమితితో పాటు ప్రజా సంఘాలన్నీ ఒక వేదికగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. పొత్తులకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఇప్పటికే వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీజేఎస్ అధినేత ఆచార్య కోదండరాం సంకేతాలిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వేదిక రాబోతున్నట్టు తెలుస్తోంది.
Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలూ అప్రమత్తమయ్యాయి. వివిధ పార్టీల్లోని నేతల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చొరవ మొదలైంది. బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లను చీలిపోకుండా నివారించే విపక్షపార్టీలు ఒక్కటవుతున్నాయి. వ్యవహారం మొత్తం మూడో కంటికి తెలియకుండా గోప్యంగా జరుగుతోంది. ప్రత్యామ్నాయ వేదికకు వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పౌర వేదికలు కూడా తగిన సహకారాన్ని ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నెల చివరి కల్లా ఈ వ్యవహారం ఓ కొలిక్కి రానున్నట్టు సమాచారం. అందరిని ఒక చోటికి చేర్చే బాధ్యతను ఆచార్య కోదండరాంకు అప్పగించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ధూంధాం పేరుతో తమ పాత్రను పోషించిన కవులు, కళాకారులకు.. కేసీఆర్, బీఆర్‌ఎస్‌తో దూరం ఏర్పడిందని చర్చ నడుస్తోంది. ప్రజా, కుల సంఘాలు, పౌరవేదికలు తెలంగాణ సాధన కోసం తమ గొంతెత్తి కొట్లాడాయి.
స్వరాష్ట్రం సిద్ధించాక అనుకున్న కలలు తీరకపోగా.. నిర్భందాలు ఎక్కవయ్యాయనే భావనతో మౌనం దాల్చాయనే భావన ఉంది. విపక్ష పార్టీలతో పాటు ప్రజా, కుల సంఘాలు, పౌర వేదికలు తెలంగాణ ఉద్యమం తరహాలో.. కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఒక్కటవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. విపక్షలన్నీ, ఇన్ని సంఘాలతో వేదిక ఏర్పాటనేది మాములు విషయం కాదు. దీనిని సమన్వయం చేయడం అంత అషామాషీకాదు.
Opposition Parties Have a Single Platform attack BRS : తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కోదండరాం అయితే.. బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే భావనను అన్ని పార్టీలు వ్యక్తపరుస్తున్నట్లు సమాచారం. కవులు, కళాకారులు, ప్రజా సంఘాలతో ఆయనకు ఉద్యమ సమయం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ వేదికకు కోదండరాం సారథ్యం వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Telangana BJP : కర్ణాటక ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభావం గణనీయంగా తగ్గిపోయిందన్న వాదన వినిపిస్తోంది. స్వయంగా ఆ పార్టీలోని నేతలే.. మూడో స్థానంలో ఉన్నట్లు వ్యాఖ్యానించడం మరింత నష్టాన్ని కలిగించింది. కాంగ్రెస్ నేతలు అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి పలికి ఐక్యతారాగాన్ని వినిపిస్తుంటే.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో రీ సౌండ్ వినిపిస్తోంది. బహిరంగంగానే పార్టీకి నష్టం కలిగేలా కమలం నాయకులు వ్యాఖ్యలు చేస్తుండటం.. కాషాయ శ్రేణులను సైతం కలవరపరుస్తున్నాయి. రెండు గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ కార్యక్రమాలు సైతం జరగకపోవడంతో బీజేపీ గ్రాఫ్ కాస్త తగ్గిపోయిందన్న ప్రచారం నడుస్తోంది.
BRS Vs Congress : కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందనే వాదనలు వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే తీరులోనే పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ముఖ్యమంత్రి సైతం బీజేపీ పేరు ఎత్తకుండా.. కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి నెలకొంది. బీఎస్పీ, వైఎస్ఆర్టీపీ, తెలంగాణ జనసమితి, వామపక్షాలు వేర్వేరుగా పోటీ చేయడాన్ని నివారించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నది ఉమ్మడి భావన కనిపిస్తోంది.
Communist Parties : విపక్షాల ఓట్ల చీలికను నివారించడం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నింటిని.. సీరియస్‌గా తీసుకుని ముమ్మరం చేయడంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామన్న కమ్యూనిస్టుల్లోనూ అంతర్మథనం మొదలైంది. ప్రజల్లో భారత్ రాష్ట్ర సమితి పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో పాటు కేసీఆర్, బీఆర్‌ఎస్ నేతల వైఖరి కామ్రేడ్లకు రుచించడంలేదని సమాచారం. క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులు సైతం కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లోకి పోవాలని పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.
దీంతో రాష్ట్ర నాయకత్వాలు దిక్కుతోచని స్థితిలో పడినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజులు వేచిచూసి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో సంప్రదింపులు ముమ్మరం చేసి ఎలాంటి విభేదాలు లేకుండా ప్రత్యామ్నాయ వేదిక ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ జరుగుతోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే నెలాఖరుకు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ఇవీ చదవండి :