Politicians Condolence to Kaikala : కైకాల సత్యనారాయణ అద్భుతమైన నటనా చాతుర్యంతో అన్ని తరాల ప్రేక్షకులను అలరించారని ప్రధాని మోదీ కొనియాడారు. కైకాల మృతి పట్ల సంతాపం ప్రకటించిన ఆయన.. కుటుంబసభ్యులకు ట్వీట్ ద్వారా సానుభూతి తెలిపారు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల గవర్నర్ తమిళిసై సంతాపం ప్రకటించారు. నవరస నటనా సార్వభౌముడిగా ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్న గవర్నర్.. కైకాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడు కైకాల అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఫిల్మ్‌నగర్‌లోని కైకాల నివాసంలో దివంగత నటుడి భౌతికకాయానికి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి నివాళులు అర్పించిన కేసీఆర్.. కుటుంబసభ్యులను ఓదార్చారు. లోక్‌సభ సభ్యునిగా ఆయన చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని సీఎం గుర్తు చేశారు.
"కైకాల సత్యనారాయణ తన విలక్షణమైన నటనాశైలితో ఎవరికీ సాధ్యం కాని పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆయనకు ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా పోషించేవారు. హీరోలకు దీటుగా రాణించేవారు. కైకాల సత్యనారాయణ ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో అనేక అనుభవాలను పంచుకున్నాను." -కేసీఆర్, ముఖ్యమంత్రి
కైకాల అందించిన సేవలకు గౌరవార్థంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రేపు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరుగుతాయని మంత్రి తలసాని వెల్లడించారు. గంభీరమైన వ్యక్తిత్వం, మంచి హాస్యం, చతురతతో కూడుకున్న నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం నిలుపుకున్నారని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. తనతో ఉన్న సాన్నిహిత్యాన్ని దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు.
సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటు: విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. సుమారు 800 సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి.. నవరస నట సార్వ భౌముడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వెలుగొందారని కొనియాడారు. కైకాల మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని హరీశ్‌రావు పేర్కొన్నారు. జానపద, పౌరాణిక, సాంఘిక, కుటుంబ కథా చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించి.. ప్రతినాయకుడుగా విలక్షణ నటనతో సినీ అభిమానుల మనస్సులో స్థానం సంపాదించుకున్న గొప్ప నటుడని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కైకాల మృతి పట్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
ఇవీ చదవండి: కైకాల పార్థీవదేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్