TSPSC paper leakage case accused Custody: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న 9మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నిందితులను ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వగా.. ఇవాల్టీ నుంచి ఈనెల 23వ తేదీ వరకు వారిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న 9 మంది నిందితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడి వైద్య పరీక్షలు అనంతరం వారిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. వారిని విచారించి లీకేజీతో ఇంకెంతమందికి సంబంధముందో నిందితులు నుంచి సమాచారం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.
సీఎం కేసీఆర్‌తో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ భేటీ: టీఎస్పీఎస్సీ తదుపరి కార్యాచరణపై కమీషన్ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నారు. ప్రగతి భవన్‌కు వెళ్లి పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణ, కమీషన్ తదుపరి కార్యాచరణపై సీఎంతో కలిసి చర్చించనున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రభుత్వ సీఎస్ శాంతి కుమారి సంబంధిత అధికారులు ప్రగతి భవన్ చేరుకున్నారు.
BJP leaders meet the Governor on TSPSC paper leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాష్ట్ర బీజేపీ నేతల బృందం కలిసింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గవర్నర్ ఇప్పటికే నివేదిక కోరారు. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా చూడాలని తమిళిసైని కోరినట్లు సమాచారం. పేపర్ లికేజీ వల్ల ఇప్పటికే నాలుగు పోటీ పరీక్షల్ని రద్దు చేశారు. గవర్నర్‌ను కలిసిన బృందంలో డీకే అరుణ, ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్, మర్రిశశిధర్‌రెడ్డి, రాంచందర్, విఠల్ తదితరులు ఉన్నారు.
మరోవైపు ఈకేసులో తవ్వేకొద్ది నిందితుల అక్రమాలు మరింత బయటపడుతున్నాయి. ఏ2 నిందితుడుగా ఉన్న రాజశేఖర్ తన దగ్గరి బంధువులను విదేశాల నుంచి రప్పించి గ్రూప్1 పరీక్ష రాయించినట్లు తెలుస్తోంది. వారు గ్రూప్1 ప్రాథమిక పరీక్షలో అర్హత కూడా సాధించినట్లు గ్రామస్థులు తెలిపారు. నిందితులు సెల్ఫోన్లు ఆధారంగా మరింత మందిని విచారించి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు.
సిట్ అందించిన నివేదికను ఆధారంగా చేసుకొని టీఎస్పీఎస్ గ్రూప్1 ప్రిలిమ్స్ సహా, ఏఈఈ, డీఏఓ పరీక్షలు రద్దు చేసింది. పరీక్షల రద్దుతో నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. చాలా ఏళ్లుగా కష్టపడి ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధిస్తే కొందరు చేసిన పనికి ఎంతో మంది నిరుద్యోగులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
TSPSC పేపర్ లీకేజీ కేసు.. విదేశాల్లో ఉన్న బంధువులను తీసుకొచ్చి గ్రూప్-1 రాయించాడు?
పీఎఫ్ఐ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
అక్టోబరు నుంచి ప్రశ్నపత్రాల చౌర్యం.. వెలుగులోకి సంచలన విషయాలు