PM Modi at BC Atma Gourava Sabha in Hyderabad : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎల్బీ స్టేడియం వేదికగా.. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసింది. బేగంపేట విమానాశ్రయం నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఓపెన్‌టాప్ జీప్‌లో ప్రజల మధ్య నుంచి వెళ్లిన మోదీపై.. పార్టీ శ్రేణులు పుష్పవర్షం కురిపించారు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వదాంతో ప్రసంగం మొదలు పెడుతున్నట్లు చెప్పిన మోదీ.. పదేళ్ల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇదే స్టేడియానికి వచ్చానని.. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ దేశ చరిత్రలో మార్పునకు నాందిగా నిలిచిందని పేర్కొన్నారు. ఆ సభ తర్వాతే భారతప్రధాని అయ్యానని గుర్తుచేశారు.
PM Modi Speech at BC Atma Gourava Sabha : ప్రస్తుతం బీసీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎల్బీ స్టేడియం కీలకంగా మారాలని మోదీ కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిందన్న మోదీ.. తిన్న అవినీతి సొమ్ము అంతా తిరిగి వసూలు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శనాస్త్రాలు సంధించారు. వారికి ప్రజాసంక్షేమం కంటే స్వలాభమే ముఖ్యమని.. ప్రధాని మోదీ విమర్శించారు.
'కాంగ్రెస్ పార్టీ 7 దశాబ్దాలుగా వారసత్వం, అవినీతి మోడల్‌ను అభివృద్ధి చేసింది. బీఆర్ఎస్ అదే దిశలో నడుస్తోంది. రాష్ట్రసంపదను దోచుకోవాలన్నదే ఆ పార్టీల లక్ష్యం. ఈ పార్టీలకు వారసులకు దోచిపెట్టడమే పని. కానీ మీ పిల్లల భవిష్యత్ వారికి ఏ మాత్రం పట్టదు. బీఆర్ఎస్ అవినీతి తీగ దిల్లీలోని మద్యం కుంభకోణంతోనూ కలిసి ఉంది. వారి అవినీతిపై విచారణ ప్రారంభిస్తే.. దర్యాప్తు సంస్థలను దూషిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరుగుతూనే ఉంటుందని ఢంకా భజాయించి చెబుతున్నా. ప్రజాధనం దోపిడీ చేసిన సొమ్మును తిరిగి వసూలు చేస్తాం. తెలంగాణ సోదరీ సోదరీమణులకు ఇదీ మోదీ గ్యారెంటీ.' - నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
Modi Fires on Congress and BRS : నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణలో.. ఆ ఆకాంక్షలు నెరవేరలేదని మోదీ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం బీసీలు ఎంతో కష్టపడ్డారని.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని.. బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని మోదీ విమర్శించారు. అధికార పార్టీ నాయకులకు అహంకారం తలకెక్కిందని మోదీ ధ్వజమెత్తారు.
'బీసీని సీఎం చేస్తామంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది, బీఆర్‌ఎస్ పశ్చాత్తాపపడుతోంది'
'బీఆర్ఎస్ రెండో టీమ్ ఏదో తెలిసిపోయింది. తెరవెనుక సీ టీమ్ ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్కి.. సీ టీమ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల డీఎన్‌ఏలో.. మూడు అంశాలు ఉమ్మడిగా కనిపిస్తాయి. మొదటిది కుటుంబ పాలన, రెండోది అవినీతి, మూడోది బుజ్జగింపు రాజకీయాలు. కుటుంబ పాలన మనస్తత్వంతో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎప్పుడూ బీసీని సీఎంను చేయలేదు.' -నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
Pawan Kalyan in BC Atma Gourava Sabha : నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షల కోసం పోరాడి.. తెలంగాణ సాధించుకున్నామని అయితే అవన్నీ నినాదాలుగానే మిగిలిపోయాయని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. దేశం సంక్షేమం కోసం మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. అందుకే తనకు మోదీ అంటే ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు.
BJP Leaders Fires on Congress and BRS : బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అమిత్ షా ప్రకటిస్తే.. కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం కాదు గుణం ముఖ్యమని కేటీఆర్ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు ఒక్కటేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఏజెంట్‌గా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎల్బీ స్డేడియం వేదికగా నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.
ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ
నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి ఉంది : పవన్ కల్యాణ్