కొవిడ్ రోగుల ప్రయోజనార్థం ప్లాస్మా దానం చేయడానికి అర్హులు ముందుకు రావాలని రాష్ట్ర ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడూరు నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య, చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయని అన్నారు.
చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరిన కొవిడ్ రోగులు ప్లాస్మాతో కోలుకుంటారని, రోగుల్లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే యాంటీ బాడీలను అభివృద్ధి చేయడానికి ప్లాస్మా దోహదం చేస్తుందని ఆయన వివరించారు. 45 నుంచి 55 రోజుల కిందట కరోనా బారిన పడి కోలుకున్న వారు.. 55 ఏళ్ల వయస్సు దాటని వారు ప్లాస్మా దానం చేయవచ్చని పేర్కొన్నారు. గతేడాది జులై 16న ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్లాస్మా దాతల సంఘం తరపున గడిచిన తొమ్మిది నెలల్లో... రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వేల మందికి ప్లాస్మా సహాయం చేసినట్లు ఆయన వివరించారు. ప్లాస్మా దాతలు తమ పేర్లను http://www.telanganaplasmadonors.com వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని, ప్లాస్మా కోరుకునే వారు కూడా ఇదే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
ఇదీ చూడండి : అన్నదాతకు వాతావరణం మేం నేర్పుతాం!