పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి(petrol, diesel price increase). ఇప్పటికే పెట్రోల్ వంద రూపాయలు దాటి పరుగులు తీస్తుండగా... డీజిల్ కూడా వందకు చేరువైంది. ధరలు పెరుగుదల వల్ల వాహనదారులతోపాటు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పార్లమెంటు సమావేశాలు జరిగిన సమయంలో కొన్ని రోజుల పాటు ఆగినట్లే కనిపించినా... తర్వాత షరామామూలైంది. ఈ ధరలు పెరుగుదల ఎప్పటి వరకు ఉంటుందో.... అసలు ఎక్కడ ఆగుతుందో.. ఎవరికి తెలియని పరిస్థితి.
నడ్డి విరుస్తోన్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇష్టానుసారంగా ఎక్సైజ్ డ్యూటీ (excise duty), వ్యాట్ (vat on diesel, petrol)లు విధించి నిలువుదోపిడి దోస్తున్నాయి. రవాణా వ్యవస్థపై భారం పడడం ఆ ప్రభావం అన్ని వస్తువుల ధరలపై చూపుతున్నప్పటికీ... ఇరు ప్రభుత్వాలు కూడా తమకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఆదివారం అంతర్జాతీయ మార్కెట్ విపణిలో ముడి చమురు 159లీటర్లు సామర్థ్యం కలిగిన బ్యారెల్ ధర రూ.5878గా ఉంది. అంటే లీటరు ముడి చమురు రూ.36.97గా ఉండగా అటు పెట్రోల్, ఇటు డీజిల్‌గా ప్రాసెసింగ్ చేసేందుకు, ప్రైట్ ఛార్జీలు అన్నీ కలుపుకుంటే రూ.43 నుంచి రూ.45 రూపాయిలకు మించదు.
వ్యాట్ పేరుతో ధరలు పెంచి
ఇక్కడ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిలువు దోపిడీ మొదలవుతుంది. లీటరు పెట్రోల్‌పై రూ.32.90లు, డీజిల్‌పై రూ.31.80లు ఎక్సైజ్ డ్యూటీ, రోడ్సెస్లను కేంద్రం విధిస్తోంది. లీటరు పెట్రోల్‌పై రూ. 3.79లు, డీజిల్‌పై 2.59లు డీలర్ కమిషన్ ఇస్తారు. ఆ మొత్తంపై ఆయా రాష్ట్రాల పరిధిలో...వ్యాట్ విధింపులు ఉంటాయి. డీలరు కమిషన్‌ను కూడా కలుపుకుంటే లీటరు పెట్రోల్ రూ.50 రూపాయిలు, లీటరు డీజిల్ 48 రూపాయిలకు మించదు.
భారీగా పెరుగుతున్న ధరలు
ఆదివారం నాడు హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.106.51లు కాగా, లీటరు డీజిల్ రూ.99.04లుగా ఉంది. ఒకవైపు ధరలు పెంపుతో...వాహనదారులు నడ్డి విరుగుతున్నా...యాభై రూపాయిలకుపైగా మొత్తాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం దోచేస్తున్నాయి. 2021-22 ఆర్థిక ఏడాది ప్రారంభంలో అంటే ఏప్రిల్ ఒకటో తేదీన పెట్రోల్ లీటరు ధర రూ. 93.99లుగా ఉండగా, డీజిల్ లీటరు ధర రూ.88.05గా ఉన్నాయి. ఆదివారం నాటితో బేరీజు వేస్తే లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.12.52లు, డీజిల్‌పై ఏకంగా రూ.10.99లు ధరలు పెరిగాయి. గడిచిన నెల రోజులు తీసుకుంటే పెట్రోల్ లీటరుపై పెట్రోల్‌పై రూ.1.25లు, డీజిల్ లీటరుపై రూ.2.35లు పెరిగినట్లు చమురు సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఈ ఏడాది గణాంకాలను పరిశీలిస్తే..
పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను ఈ ఆర్థిక ఏడాది ప్రారంభం నుంచి పరిశీలించినట్లయితే...పెట్రోల్‌పై ఏప్రిల్‌లో 18పైసలు, డీజిల్‌పై 17పైసలు ధర తగ్గింది. మే నెలలో పెట్రోల్‌పై రూ.4.02లు, డీజిల్‌పై రూ.5.15లు ధరలు పెరిగాయి. జూన్ నెలలో పెట్రోల్‌పై రూ.4.37లు, డీజిల్‌పై రూ.4.24లు చొప్పున పెరిగింది. జులైలో పెట్రోల్‌పై రూ.2.97లు, డీజిల్‌పై 78పైసలు లెక్కన పెరిగాయి. ఆగస్టులో పెట్రోల్‌పై 27పైసలు, డీజిల్‌పై ఒక్క పైసా స్వల్పంగా ధరలు తగ్గాయి. సెప్టెంబరులో పెట్రోల్‌పై 32పైసలు, డీజిల్‌పై రూ.1.24లు లెక్కన ధరలు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన మూడునాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఎన్ని రోజులు...ఇలా పెరుగుతూ పోతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్న వాహనదారులు తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ధరలు తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఆల్‌టైం హై వద్ద పెట్రోల్ రేట్లు- సామాన్యులపై భారం తగ్గేదెలా?