పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఉన్న ఫలంగా రుచి, వాసన కోల్పోవటం వల్ల నారాయణరెడ్డి అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో పాజిటివ్ అని నిర్ధారణ కావటం వల్ల చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ఒళ్లు నొప్పులు మినహా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గూడూరు నారాయణరెడ్డి వెల్లడించారు.
తాను ఎక్కడా ప్రయాణం చేయకపోయినా... కరోనా పాజిటివ్ రావడం పలు అనుమానాలకు తావిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో మురికి వాడల్లో పర్యటించి అక్కడ ప్రజలకు మాస్కులు, శానిటైజర్లను నారాయణరెడ్డి పంపిణీ చేశారు. దాదాపు వారం, పది రోజులు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించినా... ఎవరిని తాకకుండానే జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అయినా కూడా తనకు కరోనా సోకటం వల్ల కమ్యూనిటీలో వ్యాప్తి జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఇంట్లో చిన్న పిల్లలు ఉండటం వల్ల... బయట అంతా తిరిగి ఇంటికి వెళ్లడం మంచిది కాదని గత కొన్ని రోజులుగా హోటల్‌లో ఉంటున్నారు. గూడూరు నారాయణ రెడ్డికి పాజిటివ్ రాగా... ఆయనతో కలిసి ఎవరెవరు తిరిగారో వారంతా కూడా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.