సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో మంగళవారం రాత్రి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశ వివరాలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించినట్లు చెప్పారు.
ప్రధానంగా తెలంగాణ, హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదలు, ప్రజల కష్ట నష్టాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలు, దుబ్బాక ఉప ఎన్నికలు తదితర అంశాలపై చర్చించినట్లు వివరించారు. వరదలను సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. తక్కువ పరిహారం ప్రకటించి వరద బాధితులను అవమానించరని ఆరోపించారు. వరద నిధులను రూ. 500 నుంచి 5000 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని.. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 5 లక్షలు, పాక్షికంగా దెబ్బ తిన్న వాటికి లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు. వరద నీరు వచ్చిన ఇళ్లకు 50 వేల లెక్కన ఇవ్వాలని కోరారు. తక్షణమే వరదకు దెబ్బ తిన్న పంటల వివరాలు సేకరించాలని.. కౌలు రైతులతో సహా ఎకరాకు 20 వేలు లెక్కన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రానికి కేంద్రం నుంచి బృందాలు పంపిస్తున్నాం: కిషన్ రెడ్డి