గత నెల 24న ప్రారంభమైన పట్టణ ప్రగత కార్యక్రమం నేటితో ముగియనుంది. పది రోజుల పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆయా పట్టణాల్లో కలియతిరుగుతూ పచ్చదనం, పరిశుభ్రతపై దృష్టి సారించారు. ఆదర్శ పట్టణాలు రూపుదిద్దుకునేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై కసరత్తు చేశారు. వార్డు కమిటీలు ఏర్పాటు చేసి ప్రత్యేకాధికారులను నియమించి వార్డుకు సంబంధించిన సమగ్ర వివరాలు, అవసరాలను గుర్తించారు.
పారిశుద్ధ్యంపై ప్రధానంగా
పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడమే కాక వ్యర్థాలు, శిథిలాలూ తొలగించడం, విద్యుత్ మరమ్మతులు చేపట్టడం లాంటి పనులు చేశారు. పట్టణ ప్రగతి నేపథ్యంలో నగరపాలక, పురపాలక సంస్థలకు ఇప్పటికే ఫిబ్రవరి నెలకు చెందిన రూ.148 కోట్లు విడుదల చేశారు. మార్చి నెలకు సంబంధించిన మరో రూ.148 కోట్లను పురపాలక శాఖ నిన్న ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు విడుదల చేసింది.
సమగ్ర నివేదికలు
పది రోజులపాటు జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమం ఆధారంగా ఆయా పట్టణాల్లో అవసరాలు, చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేయనున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా వయోజన నిరక్షరాస్యుల వివరాలను కూడా సేకరించారు. కార్యక్రమ వివరాలతో కూడిన సమగ్ర నివేదికలను ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది.
కలెక్టర్లతో సమావేశం కానున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
ఈనెల 6న అదనపు కలెక్టర్లతో సమావేశం కానున్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. పట్టణ ప్రగతి పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కలెక్టర్లు, ఆదనపు కలెక్టర్లు, కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్ పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లకు అవగాహన కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం... త్వరలోనే జిల్లా స్థాయిలోనూ శిక్షణా కార్యక్రమాలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులకు జిల్లాస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.
ఇవీ చూడండి: 'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'