ఉపాధిహామీ పథకం అమలులో ప్రధాని మోదీ రాష్ట్రాన్ని అభినందిస్తున్నారే కానీ.. నిధులు మాత్రం ఇవ్వటం లేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా దుర్వినియోగం చేయకుండా నరేగా పథకాన్ని వినియోగించుకుంటున్నామని తెలిపారు.
ప్రభుత్వాన్ని విమర్శించే విపక్ష నేతలు గ్రామాల్లోకి అభివృద్ధి పనులను పరిశీలించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. వైకుంఠధామాల నిర్మాణాలను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిందేనని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
రాష్ట్ర పథకాలకు కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చింది. మన పనితీరును పొగుడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి మిషన్ భగీరథను మెచ్చుకున్నారు. పార్లమెంట్‌లో కూడా నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ నుంచి విముక్తి పొందిందని ప్రకటించారు. అయినా కేంద్రం ఒక్క రూపాయి నిధులు ఇవ్వటం లేదు. పనితీరును గుర్తించిన కేంద్రం తరఫున అవార్డులు ఇస్తున్నారే కానీ.. నిధులిచ్చి ప్రోత్సాహించడం లేదు. గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధిని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం అమల్లోనూ మనమే సమర్థంగా పనిచేస్తున్నాం- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి