Pakistani Arrested Update in Hyderabad : ఈనెల 1వ తేదీన తన భార్యాబిడ్డలను చూడటానికి పాకిస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అతడు ఇండియాలోకి ప్రవేశించేందుకు అత్తామామలే సహకరించినట్లు తొలుత తేలింది. అయితే ఇప్పుడు ఈ కేసులో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ వ్యక్తి ఇండియాలోకి వచ్చేందుకు సహకరించిన మామే.. అతడికి సంబంధించి సమాచారాన్ని పోలీసులకు అందించి వారికి పట్టించినట్లు తేలింది. అసలు ఈ మామా అల్లుడి స్టోరీ ఏంటో ఓసారి తెలుసుకుందామా..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫయాజ్ అహ్మద్(24) పాకిస్థాన్‌లోని ఖైబర్ పంక్తుఖ్వాకు చెందిన యువకుడు. 2018లో షార్జాలోని సైఫ్‌జోన్ వస్త్ర పరిశ్రమలో పని చేసేవాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన నేహ ఫాతిమా(29) ఉపాధి కోసం షార్జాకు వెళ్లింది. ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ యువకుడు ఫాతిమాకు సాయం చేశాడు. ఆ సమయంలో వారి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం.. ప్రేమ.. పెళ్లిగా మారేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 2019 షార్జాలోనే వారు వివాహం చేసుకున్నారు.
Pakistani Love Story : మూడు సంవత్సరాలు షార్జాలో వారి వివహబంధం కొనసాగిన అనంతరం.. గర్భవతి కావడం.. పలు ఆరోగ్య సమస్యల కారణంగా ఫాతిమా హైదరాబాద్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. షార్జాలో ఉంటున్న ఫయాజ్ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటాయని ఫాతిమా తండ్రి జుబేష్ షేక్ భావించి.. సరికొత్త పథకం రచించాడు. అల్లుడు పాకిస్థాన్‌లో ఉన్నాడని తెలుసుకుని.. ఇండియాకు రప్పించే ప్రయత్నం చేశాడు.
Hyderabad girl Pakistan Boy Love Story : అల్లుడిని భారత్‌కు వచ్చేయమని.. ఎలాంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని .. తన కుమార్తె, మనవడి పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు. తన భార్యాబిడ్డలను చూడటానికైనా భారత్ వెళ్లాలని ఫయాజ్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం తమ మామకు చెప్పాడు. అయితే భారత్ వీసా రాడానికి ఎక్కువ సమయం పడుతుందని.. అందువల్ల నేపాల్ వీసా తీసుకోమని ఫయాజ్‌కు తన మామ జుబేష్ షేక్ సలహా ఇచ్చాడు. అలా గతేడాది నవంబర్‌లో అత్తమామలు జుబేష్, అఫ్జల్ బేగంతో పాటు యువకుడి భార్య ఫాతిమా నేపాల్ వెళ్లి ఫయాజ్ను కలిశారు. అక్కడి నుంచి నలుగురు నేపాల్-యూపీ సోనాలీ సరిహద్దు వద్ద గస్తీ సిబ్బందికి రూ.5,000 ఇచ్చి రైలులో హైదరాబాద్ చేరుకున్నారు.
Pakistani Crossing India Border Illegally : హైదరాబాద్ చేరుకున్న అనంతరం పాక్ అల్లుడిని.. భారత పౌరునిగా మార్చేందుకు మామ మార్గాలను వెతకడం ప్రారంభించాడు. ఆధార్‌కార్డు వచ్చేంత వరకు అతడ్ని దాదాపు ఏడాదిన్నర ఇల్లు కదలకుండా చేశాడు. మార్చి నెలలో ఫయాజ్ బామ్మర్ధి మహ్మద్ గౌస్ పేరుతో ఓ మీ-సేవ కేంద్రం ద్వారా రూ.5వేలు ఇచ్చి జీహెచ్‌ఎంసీ నుంచి జనన ధ్రువపత్రం పొందారు. అనంతరం ఆధార్‌కార్డు పొందేందుకు మాదాపూర్‌లోని ఆధార్కేంద్రాని(Aadhar Center)కి ఫయాజ్ వెళ్లాడు. ఈ సమయంలో అల్లుడు తెచ్చిన రూ.4-5 లక్షలు అయిపోవడంతో మామ దుర్బద్ధి బయటపడింది. ఎలాగైనా అల్లుడ్ని వదిలించుకోవాలని భావించి.. అతనే స్వయంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈ నెల 1న ఆ యువకుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం అతని అత్తామామలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
మతం మార్చుకుని పాక్ ప్రియుడితో పెళ్లి.. ఫాతిమాగా పేరు మార్చుకుని అంజూ వివాహం
పాక్ యువతిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు హైదరాబాదీ సాహసం.. రంగంలోకి దిగిన పోలీసులు