చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి అరుదైన ఘనతకు సిద్ధమవుతోంది. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఉస్మానియాలో చర్మనిధి(స్కిన్ బ్యాంకు) ఏర్పాటు కానుంది. దీనికి అవసరమైన గదులు, పరికరాలు, ఇతర సామగ్రికి దాదాపు రూ.70 లక్షల వ్యయమవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేయగా వాటిని సమకూర్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ ఈస్ట్(హైదరాబాద్) ముందుకొచ్చింది. ఇటీవల ఉస్మానియా వైద్యులను కలిసిన క్లబ్ ప్రతినిధులు ఇందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతుల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, డీఎంఈ రమేష్‌రెడ్డిలకు నివేదిక సమర్పించారు. ఆమోదం లభించగానే ప్రక్రియ షురూ కానుంది.
ఉస్మానియా ఆస్పత్రిలో ఏటా వెయ్యికి పైగా ప్లాస్టిక్ సర్జరీలు జరుగుతుంటాయి. శరీరంపై కాలిన గాయాలు, గ్రహణం మొర్రి, కుష్ఠు వ్యాధితో వంకరైన చేతులు, కాళ్లు సరిచేయడం.. తెగిన చేతులు, వేళ్లు అతికించడం..ఇతరత్రా చికిత్సలకు చర్మం అవసరమవుతోంది. బాధితుల శరీరంలోని కాళ్లు, చేతులు, తొడలు తదితర భాగాల నుంచి చర్మం సేకరించి, గాయాలైన చోట గ్రాఫ్టింగ్ ద్వారా అమర్చుతున్నారు. 15-20 శాతం మాత్రమే ఇలా సేకరిస్తారు. ఎక్కువ చర్మం కావాలంటే చర్మ నిధి ఉపయోగపడుతుంది.
ఎవరి నుంచి సేకరిస్తారంటే..
జీవన్మృతులు(బ్రెయిన్‌డెడ్), ప్రమాదాల్లో మృతిచెందిన వారి చర్మాన్ని 12 గంటలలోపు సేకరించి ప్రత్యేక పద్ధతిలో భద్రపరుస్తారు. ఇందుకు ఆసుపత్రిలో బ్యాక్టీరియా, వైరస్ రహిత గదులు, అధునాతన రిఫ్రిజిరేటర్లు, గ్రాఫ్టింగ్ పరికరాలు అవసరం. రోటరీ క్లబ్ ఆయా మౌలిక వసతుల కల్పనకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వ అనుమతి వస్తే.. చర్మనిధి ఏర్పాటుకు మార్గం సులువవుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆరు నెలల్లోనే చర్మనిధి అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
వారికి సంజీవని...
కాలిన గాయాలైన వారికి చర్మనిధి సంజీవనిలా పనిచేస్తుంది. సాధారణంగా చర్మం కింద ఎపిడెర్మిస్, డెర్మిస్, డీప్ డెర్మిస్, సబ్‌క్యుటేనియస్ టిష్యూ పొరలుంటాయి. మంటల్లో చర్మం తీవ్రంగా కాలిపోయినప్పుడు డీప్ డెర్మిస్ అంతకంటే కింద పొరలు దెబ్బతింటాయి. శరీరంలోని ప్రొటీన్ నీరు రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లు సోకి ఎక్కువమంది మృతి చెందుతుంటారు. ఆ ముప్పు రాకుండా చర్మనిధి నుంచి చర్మాన్ని సేకరించి బాధితులకు తాత్కాలిక గ్రాఫ్టింగ్ చేసి ఇన్‌ఫెక్షన్లు నియంత్రిస్తారు. ఫలితంగా బాధితులు బతికే అవకాశాలు పెరుగుతాయి.
ఇదీ చదవండి: దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్