Political Fire in Telangana With TSPSC Issue: మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ.. రాష్ట్రంలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వంలో ఉన్న వారి హస్తం ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా.. అదే స్థాయిలో అధికార పార్టీ ఎదురుదాడి చేస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు నిరసనలతో హోరెత్తిస్తుండగా.. ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నాయి.
TSPSC Paper Leak Update: నిన్న హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణిక్‌రావు ఠాక్రే ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ, రేపు ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న నిరుద్యోగ నిరసన దీక్షలకు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన టీఎప్పీఎస్సీ కమిషన్ సభ్యులందరినీ వెంటనే తొలగించాలని సీఎల్పీ నేత భట్టి డిమాండ్ చేశారు. కుమురం భీం జిల్లా కెరిమెరి మండలంలో పాదయాత్రలో భాగంగా.. లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
అటు బీజేపీ సైతం ‘మా నౌకరీలు మాగ్గావాలె’ నినాదంతో రేపు ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ మహా ధర్నా చేపట్టనుంది. రాజ్యాంగబద్ధమైన సంస్థలను రాజకీయం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఆ పార్టీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిన్న విద్యార్థి సంఘాలతో సమావేశమయ్యారు. ఈ వ్యవహారంలో నిందితులపై చర్యలు తీసుకోకుండా ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర అధ్యక్షులకు లీగల్ నోటీసులు: తాజా పరిణామాలపై నిరుద్యోగులంతా ఆందోళనలో ఉన్నారన్న ఆయన.. మోండా మార్కెట్‌లో కూరగాయల కంటే దారుణంగా ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలంటూ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్‌లు పంపారు.
కేటీఆర్‌ను భర్తరఫ్ చేసేవరకూ వదిలిపెట్టం: దురుద్దేశంతోనే తనను పేపర్ లీకేజీ కేసులోకి లాగుతున్నారని నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్ తాటాకు చప్పుళ్లకు బెదరబోమన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేటీఆర్‌ను భర్తరఫ్ చేసేవరకూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ ఘటనను రాజకీయం చేయడం తగదని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రతీ అంశాన్ని రాజకీయ లబ్ధికోసమే వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
లీకేజీ అంశంపై 48 గంటల్లో నివేదికలు సమర్పించాలి: మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై 48 గంటల్లో తాజా నివేదికలు సమర్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు టీఎస్పీఎస్సీ, డీజీపీకి రాజ్‌భవన్ కార్యాలయం లేఖలు పంపించింది. సిట్ దర్యాప్తు ఏ దశలో ఉందో తెలపాలని గవర్నర్ లేఖలో స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న రెగ్యులర్, పొరుగు సేవల సిబ్బంది ఎంత మంది నియామక పరీక్షలు రాశారో నివేదిక ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సెలవులు పెట్టారా.. పరీక్షల్లో వారి ఫలితాలు ఎలా వచ్చాయో తదితర విషయాలను నివేదికలో వివరించాలని తమిళిసై సూచించారు.
ఇవీ చదవండి: