పెట్రో భారం... డ్రైవర్లు, క్లీనర్ల బతుకులు దయనీయం - హైదరాబాద్లో కష్టసాధ్యంగా లారీల నిర్వహణ
లారీనిర్వాహకులకు.. కష్టకాలం కొనసాగుతోంది. లాక్‌డౌన్‌తో ఇప్పటికే నష్టాలు మూటగట్టుకున్న వారికి పెరిగిన డీజిల్ ధరలు పెనుభారంగా మారుతున్నాయి. ధరాభారంతో లారీల్ని నడపలేకపోతున్నారు. పెంచిన ధరల మేరకు వినియోగదారులపై ఛార్జీలభారం మోపలేక నడిపి నష్టాలు కొనితెచ్చులేక అల్లాడిపోతున్నారు.

లారీల యజమానులు, డ్రైవర్లను కష్టాలు వీడట్లేదు. కరోనా ప్రభావంతో రెండున్నర నెలలు దాదాపు వాహనాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నిర్మాణరంగం కుదుటపడుతోంది. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పనులు కొనసాగుతున్నాయి.
సిమెంట్, ఇసుక, కంకర రవాణాలో వేగం పెరిగింది. వాటితో కష్టాలు తీరుతాయనుకున్న సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా డీజిల్ ధరల రూపంలో లారీ నిర్వాహకులకు మరో నష్టం వచ్చిపడింది. గడిచిన 21 రోజుల్లో డీజిల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతుండడం లారీ యజమానులను, డ్రైవర్లను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.
ధరలు పెంచితే.. గిరాకీపై ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా లక్షా75వేల లారీలు, ట్రక్కులు, డీసీఎంలు సరుకు రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి ఇంట్లో ఉపయోగించే పాలు, పండ్లు, కూరగాయలు, పప్పులు, బియ్యం వంటి నిత్యావసర సరకులను ఆ వాహనాల్లోనే చేరవేస్తున్నారు. వాటి రవాణాకు వినియోగించే డీజిల్ ధరలు గడిచిన 21 రోజుల్లో సుమారు 10 రూపాయల వరకు పెరిగిందని లారీ డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధరలు పెంచితే గిరాకీలు తగ్గిపోతాయని.. పెంచకుంటే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లారీ డ్రైవర్లు, క్లీనర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని హైదరాబాద్ ఆటోనగర్‌లో ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లారీ రంగాన్ని ఆదుకోవాలని యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు కోరుతున్నారు. కిస్తీలు కట్టలేకపోతున్నామన్న యజమానులు... మూడు నెలల క్వార్టర్ టాక్స్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: భూ ఆక్రమణలకు చైనా క్యాబేజీ వ్యూహం..!