ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు శాంతినగర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి భవన నిర్మాణ పనులకు వెళుతున్నాడు. అలా వచ్చిన కూలిడబ్బుతో చిట్టీలు వేస్తూ ఇంటి అప్పులు తీరుస్తున్నాడు. మేడ్చల్ జిల్లా కౌకూర్ హైస్కూల్లో దాదాపు 15 మంది బడికి రావడం లేదు. ప్రాంతాలకు వలస వెళ్లారు.
కరీంనగర్‌లోని ఓ హైస్కూల్లో పదో తరగతిలో ముగ్గురు అమ్మాయిలకు వివాహాలై చదువు మానేశారు. పిల్లలిలా మధ్యలోనే బడి మానేయడానికి పేదరికమే అసలు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నాయనమ్మకు తోడుగా..
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట తండాకు చెందిన గుగులోతు శివ 2020 మార్చి వరకు స్థానిక పల్వంచ హైస్కూల్లో చదువుకున్నాడు. గత మార్చిలో స్కూళ్లు తెరచినప్పుడూ ఆరో తరగతిలో 11 రోజులపాటు బడికి వెళ్లాడు. సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులు మొదలుకాగా.. ఒకరోజు వెళ్లి ఏడో తరగతి పుస్తకాలు తెచ్చుకున్నాడు. మళ్లీ పాఠశాల ముఖం చూసింది లేదు. తండ్రి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోగా.. తల్లి కామారెడ్డికి వెళ్లి వెల్లుల్లి అమ్ముతుంటుంది. వృద్ధురాలైన నాయనమ్మకు తోడుగా శివ ఇంటివద్దే ఉంటున్నాడు.
అన్నతో కేటరింగ్ పనికెళ్తూ..
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి జడ్పీ హైస్కూల్లో ఓ బాలుడు 9వ తరగతి చదువుతున్నట్లు రికార్డులో ఉంది. ఈ ఏడాది బడులు తెరిచినా ఆ విద్యార్థి రెండు నెలలుగా హాజరుకావడం లేదు. ఇంటి పరిస్థితుల నేపథ్యంగా అన్న వెంట కేటరింగ్ పనికి వెళుతున్నాడు. రోజుకు రూ.300-400 వస్తున్నాయని చెప్పాడు.
కనీసం అరలక్ష మంది..?
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 8000, ఆదర్శ పాఠశాలలు 194 ఉన్నాయి. వాటిలోని 6-10 తరగతుల విద్యార్థులు 11 లక్షల మంది. ఎక్కువ శాతం పాఠశాలల్లో 5-10 మంది పిల్లలు సెప్టెంబరు ఒకటి నుంచి బడులకు రావడం లేదు. ఆ లెక్కన కనిష్ఠంగా చూసినా 41వేల మంది బడిముఖం చూడలేదని స్పష్టమవుతోంది. ఎయిడెడ్ పాఠశాలల్లో 81వేల మంది పిల్లలు చదువుతున్నారు. వాటిలోనూ గైర్హాజరు అవుతున్నవారు మరో 4వేల మంది ఉండనున్నారు. మొత్తంగా కనీసం అరలక్ష మంది పిల్లలు బడికి దూరమైనట్లు తెలుస్తోంది. ఇక కేజీబీవీలు, గురుకులాలు తదితరాల్లో మరో 2 లక్షల మంది ఉన్నారు. అవి అక్టోబరు 25 నుంచి మొదలయ్యాయి. వాటిలో హాజరు 50శాతం దాటలేదు. ఈ నెలాఖరుకు వాటిపై స్పష్టత రానుంది.
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పల్వంచ హైస్కూల్లో 5-10 శాతం మంది పిల్లలు బడికి రావడం లేదని ప్రధానోపాధ్యాయుడు గీతాలాల్ చెప్పారు.
- దాదాపు 10 శాతం మంది విద్యార్థుల పేర్లు రికార్డుల్లోనే ఉంటున్నాయని, వారు తరగతులకు హాజరు కావడం లేదని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు వ్యాఖ్యానించారు.
- ప్రస్తుతం విద్యాశాఖ బడులకు వస్తున్న పిల్లల సౌకర్యాలపైనే దృష్టిపెట్టిందని, రానివారి గురించి పట్టించుకోవటం లేదని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నయ్య తెలిపారు.
- ఆయా మార్గాల్లో బస్సులు లేక దూరప్రాంతాల విద్యార్థులు పాఠశాలలకు రావడం లేదని ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: