తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించే డైరీలు, క్యాలెండర్లకు శ్రీవారి భక్తుల నుంచి విశేష ఆదరణ ఉంది. హిందూ సనాతన ధర్మాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో... 19 ఏళ్ల క్రితం స్వామివారి ప్రతిరూపాలతో క్యాలెండర్లను దేవస్థానం రూపొందించి అమ్మడాన్ని ప్రారంభించారు. మొదటి ఏడాది ఐదువేల కాలమానపట్టికలతో ప్రారంభించి... డిమాండ్ తగ్గట్లుగా ప్రింటింగ్ పెంచుతూ వచ్చారు. గతేడాది డిసెంబర్ నాటికి వివిధ రకాల డైరీలు, క్యాలెండర్లు కలిపి 39 లక్షలకుపైగా అందుబాటులో ఉంచారు. అయితే ఈ ఏడాది ముద్రణ భారీగా తగ్గించేశారు. ఫలితంగా.. తిరుమలలోనూ తితిదే క్యాలెండర్లు, డైరీలు లభించడం లేదు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పుస్తక విక్రయ కేంద్రం వద్ద డైరీలు, క్యాలెండర్లు లభించకపోవడంపై భక్తులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
నిరాశలో భక్తులు...
పంచాంగం వివరాలు, శుభఘడియలు, గోవిందనామాలు ఉండటం తితిదే డైరీల ప్రత్యేకత. ఇక తిథి, వార, నక్షత్ర, కాలాల వివరాలు పేజీ పైభాగంలో స్పష్టంగా ఉంటాయి. అందుకే భక్తులు ఈ డైరీలను కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఇప్పుడు ఇవి లభించకపోవటంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తితిదే డైరీల్లో నాణ్యత లోపించిందని ఫిర్యాదులు అందుతున్నాయి. సంపూర్ణంగా వివరాలు ఉండట్లేదని భక్తులు అంటున్నారు.
ఇదీ చదవండి: శ్రీవారి ఆలయం మూసివేత... ఎందుకంటే..?