రైతుబంధు పథకానికి అర్హుల సంఖ్య పెరగకుండా వ్యవసాయ శాఖ అప్రకటిత నిషేధం అమలు చేస్తోంది. వ్యవసాయ భూములను రైతులు అమ్ముకున్న తర్వాత అవి కొన్న వారికి పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చినా కొత్త రైతుల పేర్లను ఆన్‌లైన్ ద్వారా రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయకుండా ఆపేసింది. గతేడాది జూన్ 10 తర్వాత కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన రైతుల వివరాలేమీ ఈ పథకం పోర్టల్‌లో నమోదు చేయడం లేదని ఓ ఉన్నత వ్యవసాయాధికారి ధృవీకరించారు. రోజూ పెద్ద సంఖ్యలో రైతులు అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారని వివరించారు.
రైతుబంధు పోర్టల్‌లో గ్రామ స్థాయిలో తొలుత రైతుల పేర్లను నమోదు చేసే అధికారం వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో)కే ఉంది. అనంతరం... మండల, జిల్లా స్థాయి అధికారులు తనిఖీ చేసి అప్‌లోడ్ చేస్తే వ్యవసాయ శాఖ పోర్టల్‌లో నిక్షిప్తమవుతాయి. వీటిని రెవెన్యూ శాఖ ఇచ్చే రికార్డుల వివరాల ఆధారంగా చెక్ చేసి బ్యాంకులకు పంపితే... రైతుబంధు సొమ్ము అందుతుంది. గత జూన్ నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు దాదాపు 2 లక్షల మందికి వచ్చినట్లు అంచనా. అందులో ఎంత మందికి ఇచ్చారనే వివరాలను అధికారికంగా చెప్పడం లేదు. గతంలో రైతుబంధు సొమ్ము రైతు ఖాతాలో జమ అయితే ఏఈవో, ఏఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో చూస్తే 'డీబీటీ సక్సెస్' అని కనిపించేంది.ఇప్పుడు అలా కనిపించకుండా ఆపివేశారు. ఫలితంగా ఎంత మందికి, ఎవరెవరికి సొమ్ము జమ అయిందనే తమకూ తెలియడం లేదని ఏఈవోలు చెబుతున్నారు.
ఈ పథకం అమలులో వ్యవసాయ శాఖ పూర్తి గోప్యత పాటిస్తోంది. ఎక్కడా వివరాలు బయటపడకుండా తగు జాగ్రత్తలు మరింత పెంచేసింది. హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ఒకరిద్దరు అధికారులు మాత్రమే ఈ పథకాన్ని పర్యవేక్షిస్తూ... తరచూ మార్పులు చేస్తున్న దృష్ట్యా... గందరగోళం ఏర్పడుతోంది. ఈ వివరాలను వెంటనే జిల్లా వ్యవసాయ అధికారులు - డీఏఓలకు కూడా ఆ ఒకరిద్దరు అధికారులు చెప్పకుండా రహస్యంగా వ్యవహస్తున్నట్లు సమాచారం. రైతులకు సమాధానం చెప్పలేక తాము నిత్యం సతమవుతున్నామని డీఏఓలు వాపోయారు.
ఇవీ చూడండి: నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన