Nizam College Students Protest: హైదరాబాద్‌లోని నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థినులు మరోసారి ఆందోళనకు దిగారు. మహిళా హాస్టల్‌ను కేటాయింపుపై మంత్రి కేటీఆర్ స్పందించినప్పటికీ.. కళాశాల ప్రిన్సిపల్ మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన హాస్టల్‌లో పీజీ విద్యార్థినులకు మాత్రమే ప్రిన్సిపల్ గదులు కేటాయించారని ఆరోపించారు. తమకు ఇప్పటికీ గదులు కేటాయించలేదని విద్యార్థినులు వాపోయారు.
దూర ప్రాంత విద్యార్థులకు వసతిగృహం సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల చేస్తున్న నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. విద్యార్థినుల విషయమై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
"మహిళా హాస్టల్‌ను కొత్తగా నిర్మించారు. బయట ఉంటే మాకు ఇబ్బందులు ఎదురవుతాయని మేము హాస్టల్ కేటాయించాలని అడిగాం. అయిదు రోజులు సమయం ఇవ్వాలని ప్రిన్సిపల్ చెప్పారు. కానీ మాకు తెలియకుండా పీజీ విద్యార్థినులకు కేటాయించారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం." -విద్యార్థినులు
"అమ్మాయిలకు చదువుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. వీరికి సరైన భద్రత కల్పించాలి. వారి చదువుకోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై మా పార్టీ తరపున వారికి మద్దతు ప్రకటిస్తున్నాం."
-సుధాకర్, ఆప్ నాయకుడు
అసలేం జరిగిదంటే: నాలుగురోజుల క్రితం నిజాం కాలేజీలో నూతనంగా నిర్మించిన మహిళా హాస్టల్‌ను అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థినులు ప్రిన్సిపల్‌తో వాగ్వాదానికి దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అయిదు రోజులు సమయం ఇవ్వాలని చెప్పిన ప్రిన్సిపల్.. దొంగచాటుగా పీజీ విద్యార్థినులకు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ప్రిన్సిపల్ కార్యాలయంలో బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినుల ఆందోళనలపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సమస్య పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: 'అడిగిందేమో మేం.. ఇచ్చిందిమో వాళ్లకి'.. నిజాం కళాశాలలో విద్యార్థుల నిరసన
ఆ విద్యార్థుల సమస్యకు వెంటనే ముగింపు పలకండి: మంత్రి కేటీఆర్
చదువుల తల్లికి అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత.. ఎంబీబీఎస్ మొత్తం ఫీజు భరిస్తానని హామీ