ఇతని పేరు జతావాత్ వెంకన్న. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇతను బోడుప్పల్లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2008లో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసి గేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కేరళలోని కాలికట్ ఎన్ఐటీలో సీటొచ్చింది. మొదటి సంవత్సరం సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినందున తర్వాతి సంవత్సరానికి అర్హత సాధించలేక హైదరాబాద్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడం వల్ల ఎస్టీ కార్పొరేషన్ లోన్ ద్వారా ఓ కారును కొని నడుపుతూ జీవిస్తున్నాడు.
ఎందుకు పక్కదారి పట్టాడంటే?
ఇదే క్రమంలో 2015లో గుర్రపు పందేల్లో బెట్టింగ్ పెట్టడం మొదలు పెట్టాడు. ఇందుకు మలక్‌పేటలోని రేసింగ్ క్లబ్‌కు నిత్యం వెళ్లేవాడు. తన స్నేహితుడు గంజాయి సరఫరాలో ఎక్కువ డబ్బులు సంపాదించడం చూసి తాను అదే మార్గాన్ని ఎంచుకున్నాడు.
గంజాయి సరఫరా చేస్తూ.. పోలీసులకు చిక్కాడు
తన స్నేహితుడి ద్వారా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సరఫరా చేసే పిల్లనాయుడు, బాబురావు, గణేశ్లతో పరిచయం పెంచుకుని వారి వద్ద కిలో 3వేలకు కొని వాటిని తన కారులో తీసుకెళ్లి హైదరాబాద్, కర్ణాటక, మహరాష్ట్రలో అవసరం ఉన్నవారికి 8వేల రూపాయలకు విక్రయించాడు. ఇదే క్రమంలో 150 కిలోల గంజాయిని 75 ప్యాకెట్లుగా చేసి తరలిస్తుండగా... సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, సరూర్ నగర్ పోలీసులు సంయుక్తంగా కొత్త పేట వద్ద వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 150 కేజీల గంజాయి, ఒక కారు, చరవాణి, 2.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సరుకు విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని సీపీ వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసై ఉన్నతమైన కుటుంబానికి మచ్చ తెచ్చిన వెంకన్న.... ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.