ఈ ప్రపంచంలో మంచి కవి చాలా కాలం బతకాలేడని.. అందుకు ఈ అసమాన సామాజిక వ్యవస్థే కారణమని ప్రజా కవి గోరెటి వెంకన్న అసహనం వ్యక్తం చేశారు. హైద్రాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ రచయితల వేదిక ఏర్పాటు చేసిన సమావేశంలో గోరెటి వెంకన్న, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రచయిత డాక్టర్ కందికొండ యాదగిరి రాసిన బీసీ కులాల కొత్తపాటని ఆవిష్కరించారు. నిజమైన కవులు తమను తాము దహనం చేసుకొని రచనలు చేస్తారని... బీసీ కులాల పై రచనలు చేయడానికి తమ సొంత ఊరు స్ఫూర్తి అని గోరెటి అన్నారు. శ్రమతత్వం, బౌద్ధతత్వమే.. బహుజనుల వాదమన్నారు. సామ్రాజ్యవాదం, జాత్యహంకారం, వర్ణ వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా కవులు రచనలు చేయవాల్సిన అవసరం ఉందన్నారు.
బీసీల రాజ్యాధికారం దిశగా సాహిత్య ఉద్యమానికి సిద్ధమవుతున్నామని.. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీలు రాజకీయాల వైపు ఎలా రావాలనే విషయమై పాట రూపంలో డా.కందికొండ రచించడం అభినందనీయమన్నారు. బీసీలు రాజ్యాధికారం చేపట్టేందుకు... రాజకీయ చైతన్యం కోసం ఈ పాటను రచించారని.. త్వరలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రచయితలతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని జాజుల శ్రీనివాస్ అన్నారు.
ఇదీ చూడండి: జేపీ నడ్డాది ద్వంద్వనీతి: సంపత్