New Bridges in Hyderabad: హైదరాబాద్‌లో మూసీ, ఈసీ నదులపై కొత్తగా వంతెనల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. మొత్తం రూ.545 కోట్ల వ్యయంతో 15 వంతెనల నిర్మాణం చేపట్టనుంది. హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్- హెచ్‌ఆర్‌డీసీఎల్ ద్వారా వంతెనల నిర్మాణం జరగనుంది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఫ్జల్‌గంజ్ వద్ద మూసీ నదిపై పాదచారుల కోసం రూ.40 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. మూసీ నదిపై రూ.52 కోట్ల వ్యయంతో మిస్సింగ్ లింక్ కారిడార్ నంబరు 99 హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపనున్నారు.
బ్రిడ్జిలే బ్రిడ్జిలు...
మూసీపై ఇబ్రహీంబాగ్ కాజ్‌వే వద్ద హైవెల్ బ్రిడ్జి అనుసంధానం కోసం రూ.39 కోట్లు వెచ్చించనున్నారు. ఈసీ నదిపై చింతల్‌మెట్- సన్‌సిటీ మధ్య అనుసంధానిస్తూ రూ.32 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈసీ నదిపై బండ్లగూడ జాగీర్ వద్ద ఐఆర్ఆర్- కిస్మత్‌పూర్ రోడ్డుపై రూ.32 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై రూ.52 కోట్ల వ్యయంతో హైలెవల్ వంతెన నిర్మాణం జరగనుంది. చాదర్‌ఘాట్ వద్ద మూసీపై రూ.42 కోట్ల వ్యయంతో మరొక బ్రిడ్జి కూడా నిర్మించనున్నారు. ఎగువన అత్తాపూర్ వద్ద మూసీపై రూ.35 కోట్ల వ్యయంతో కొత్తగా సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు.
మరికొన్ని...
మూసీపై ఉప్పల్ భగాయత్ లేఔట్ - దక్షిణ బ్యాంకు వరకు రూ.42 కోట్ల వ్యయంతో కొత్త వంతెన నిర్మించనున్నారు. మంచిరేవుల- నార్సింగి మధ్య అనుసంధానిస్తూ మూసీపై రూ.39 కోట్ల వ్యయంతో కొత్త వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్ ఐటీ పార్కు నుంచి ఈసీ నది వరకు అనుసంధానంగా రోడ్ల వరకు సమాంతరంగా రూ.32 కోట్ల వ్యయంతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మించనున్నాను. హైదర్‌షాకోటే నుంచి రాందేవ్‌గూడ వరకు మూసీ నదిపై రూ.42 కోట్ల వ్యయంతో కొత్త వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. బుద్వేల్ ఐటీ పార్కు నుంచి సమాంతరంగా కలుపుతూ వెళ్లే ఇతర రోడ్లపై ఈసీ నది వద్ద రూ.20 కోట్ల వ్యయంతో కొత్త బ్రిడ్జి నిర్మించనున్నారు.
50: 50 నిధులు...
మూసీపై గౌరెల్లి- ప్రతాప్‌సింగారం మధ్య రూ.35 కోట్ల వ్యయంతో రెండో కొత్త వంతెన నిర్మించనున్నారు. కొత్త లింక్ రోడ్ల కోసం మరో రూ.11 కోట్ల వ్యయంతో మంచిరేవుల బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. కృష్ణా ఉప నదులుగా పిలవబడే మూసీ, ఈస నదులపై నిర్మించనున్న కొత్త వంతెనల నిర్మాణం సంబంధించి 50 శాతం హెచ్ఎండీఏ నిధులు, మిగతా 50 శాతం రుణాల ద్వారా జీహెచ్ఎంసీ సమకూర్చుకోనున్నాయని పురపాలక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: Harish Rao on Unemployment: 'నిరుద్యోగం రాష్ట్రంలో ఎక్కువుందా..దేశంలోనా?'