పోలీస్ ప్రాథమిక రాతపరీక్ష అర్హతలో ఈసారి మార్పులు చేశారు. 2018 నోటిఫికేషన్ సమయంలో పీడబ్ల్యూటీలో అర్హత పొందేందుకు కేటగిరీల వారీగా వేర్వేరు మార్కులు సాధించాల్సి వచ్చేది. ఓసీలైతే 40 శాతం.. బీసీలకు 35 శాతం.. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు 30 శాతం రావాల్సి ఉండేది. అప్పట్లో నెగెటివ్ మార్కులుండేవి కావు. ఈసారి అందుకు భిన్నంగా అన్ని కేటగిరీల అభ్యర్థులకు 30 శాతమే అర్హతగా పరిగణించనున్నారు.
200 మార్కులున్న ప్రశ్నపత్రంలో 60 సరైన సమాధానాలు గుర్తించగలిగితే తదుపరి అంకమైన శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించగలుగుతారు. ఓఎంఆర్ షీట్‌లో ఎలాంటి బబ్లింగ్ లేకుండా ఉన్న సమాధానాలకు సున్నా మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాకాకుండా బబ్లింగ్ చేసిన జవాబు తప్పయితే నెగెటివ్ మార్కులు వేయనున్నారు. ఐదు తప్పుడు సమాధానాలకు ఒక్కో నెగెటివ్ మార్కు పడనుంది. కాబట్టి ఊహించి సమాధానాలు రాయకపోవడమే ఉత్తమమని మండలి ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
మూడు లక్షలకు పైగా దరఖాస్తుల తిరస్కరణ..
ఈసారి పలు కారణాలతో భారీగా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తొలుత 17,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 587 ఎస్సై పోస్టులు కాగా సుమారు 2.47 లక్షల దరఖాస్తులొచ్చాయి. అలాగే 16,704 కానిస్టేబుళ్ల పోస్టులకు దాదాపు 9.54 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరిశీలన అనంతరం ఎస్సై పోస్టులకు సుమారు 2.45 లక్షలు, కానిస్టేబుల్ పోస్టులకు 6.5 లక్షల దరఖాస్తులే మిగిలాయి. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వేర్వేరు విభాగాలకు వేర్వేరు సెల్‌నంబర్లతో దరఖాస్తులు చేసుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా మండలి వర్గాలు గుర్తించాయి.
ఇవీ చూడండి..
పోలీస్ అభ్యర్థులకు అలర్ట్... ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల తేదీలివే..
పోలీసులకు కొత్త మాన్యువల్.. న్యాయశాఖ పరిశీలన అనంతరం అమల్లోకి..