JEE Mains 2022: జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలను మారుస్తూ జాతీయ పరీక్షల సంస్థ నిర్ణయం తీసుకొంది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాల్సిన మొదటి విడత జేఈఈ మెయిన్ పరీక్షలను.. అదే నెల 21 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (జాతీయ పరీక్షల సంస్థ) వెల్లడించింది. బోర్డు పరీక్షలు ఉన్నందున షెడ్యూల్ మార్చాలని విద్యార్థులు కోరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. ఏప్రిల్ రెండో వారంలో అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. రెండో విడత జేఈఈ మెయిన్ మే 24 నుంచి 29 వరకు జరగనున్నాయి.
ఇంటర్ పరీక్షల తేదీలపై పునరాలోచన..
ఇంటర్ పరీక్షల తేదీలపై విద్యాశాఖ పునరాలోచన చేస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జేఈఈ మెయిన్స్ ప్రభావంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చే అవకాశం ఉందని సూచనప్రాయంగా వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో కొత్త షెడ్యూల్ విడుదలచేస్తామన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇటీవల అధికారులు నిర్ణయించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు నిర్వహించాల్సి ఉంది.
ఇదీచూడండి: KTR On Students: ఆరు నెలలపాటు సినిమాలు కాస్త తక్కువగా చూడండి: కేటీఆర్