NTR on Tarakaratna Health Condition: నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పారు. తనకి మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. కుటుంబసభ్యులు అందరం తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని వేడుకున్నారు. తారకరత్నకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని.. ఆయన త్వరలోనే కోలుకోవాలని.. అందరి ఆశీస్సులు ఈ సమయంలో కావాలని కోరారు. కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్ ఎంతో సహకారం అందిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.
''తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యానికి స్పందిస్తున్నారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు తారకరత్నకు కావాలి. కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్ ఎంతో సహకరించారు.''-జూ.ఎన్టీఆర్
అంతకుముందు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తమ కుటుంబసభ్యులతో ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. అనంతరం ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తారకరత్న కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
బాలకృష్ణ సతీమణి వసుంధర, నారాలోకేశ్ భార్య బ్రాహ్మణి ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్ కూడా నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మీడియాతో తారకరత్న ఆరోగ్యస్థితిని నందమూరి బాలకృష్ణ వివరించారు.
ఏం జరిగిందంటే?: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. పల్స్ పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి: