రాత్రి కురిసిన కుండపోత వానకి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. హిమాయత్ సాగర్ పూర్తిగా నిండటంతో గేట్లను ఎత్తివేశారు. దీంతో మురికి నీటితో ప్రవహించే మూసీ నది ఉగ్రరూపం దాల్చుతోంది.
మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ నుంచి అంబర్‌పేట వెళ్లే మార్గంలో ఉన్న ముసారాంబాగ్ వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. బ్రిడ్జికి రెండు వైపులా కాపలా ఉంటూ వాహనదారులను ఎవరినీ వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆక్రమణలన్నీ నీట మునిగే
పురాణాపూల్ నుంచి ముసారాంబాగ్ వరకు మూసీని ఆక్రమించి చేసిన నిర్మాణాలన్నీ నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కొందరు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వరద ఉద్ధృతికి సిలిండర్ వంటి బరువైన వస్తువులు సైతం కొట్టుకుపోతున్నాయి.
కోటి నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్లే వంతెనపై మూసీ పొంగి ప్రవహించడంతో రహదారి కొట్టుకుపోయి గుంతలు ఏర్పడటంతో పాటు వాహన రాకపోకలకు అవకాశం లేకుండా కంకర తేలింది.
ఇదీ చదవండి: 'దేశంలో కరోనా 2.0 రాదని చెప్పలేం'