రాష్ట్రంలోని జాతీయ రహదార్ల వెంట కొన్ని కిలోమీటర్ల మేర ప్రాంతాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనున్నారు. ఆ ఫలితాల ఆధారంగా మిగతా ప్రాంతాల్లోనూ బహుళ వరుసల్లో జాతీయ రహదార్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ జాతీయ, రాష్ట్ర రహదార్ల నిర్మాణ పనులు, త్వరితగతిన అటవీ అనుమతుల కోసం అధికారులు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ అరణ్యభవన్‌లో జరిగిన సమావేశంలో అటవీ, రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో పాటు జాతీయ రహదార్ల సంస్థ సలహాదార్లు, అధికారులు పాల్గొన్నారు.
వివిధ దశల్లో ఉన్న 29 రహదార్లకు అనుమతులు, వాటి పురోగతిపై సమీక్షించారు. సంగారెడ్డి-నాందేడ్ -అకోలా, హైదరాబాద్-మన్నెగూడ, నిజామాబాద్-జగదల్‌పూర్, మంచిర్యాల-చెన్నూరు, హైదరాబాద్-భూపాలపల్లి జాతీయ రహదారుల విస్తరణతో పాటు ఇతర రహదార్ల అనుమతుల విషయమై చర్చించారు. అన్ని జాతీయ రహదారుల వెంట పచ్చదనం పెంపు, మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ అభివృద్ది నమూనాలపై సమావేశంలో చర్చించారు.
ఇదీ చదవండి: కొలువులు రాక కొలుపు చెబుతున్న పట్టభద్రులు