రాష్ట్రంలో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆలయాలన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన సోమవారం సాయంత్రం 6 గంటల వరకు శ్రీనివాసున్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ధనుర్మాస కైంకర్యాలను ఏకాంతంగా పూర్తిచేసిన తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
భూతల స్వర్గాన్ని తలపించిన భద్రాద్రి
భద్రాచలంలో సీతాసమేతంగా రామయ్య పవిత్రమైన ముక్కోటి ఏకాదశి వేళ దర్శనమివ్వగా భద్రాద్రి భూలోక వైకుంఠమై సాక్షాత్కరించింది. ఉత్తర ద్వారాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించడం వల్ల భూలోక స్వర్గాన్ని తలపించింది. ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన సీతారామ లక్ష్మణ మూర్తులు తిరువీధికి వేంచేసి నీరాజనాలు అందుకున్నారు.
భక్తులను అలరించిన లక్ష్మీ నారసింహులు
యాదాద్రి పుణ్యక్షేత్రంలో వైకుంఠనాథుడైన మహా విష్ణువు రూపంతో లక్ష్మీ నారసింహులు బాలాలయ ద్వారం చెంత దర్శనమిచ్చి భక్తులను అలరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉత్తర ద్వారం ద్వారా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు దాదపు 50 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
అనంత పద్మనాభునిగా రాజన్న దర్శనం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి, శ్రీ పార్వతీ రాజేశ్వరస్వామి వార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
ఇదీ చదవండిః 2020లో టీ హబ్ రెండో దశ ప్రారంభం: కేటీఆర్