ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 సంక్షోభం సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం సజావుగా అమలు చేసేందుకు క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్ర స్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల రాష్ట్రానికి అనేక సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారాలు వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖలో వెల్లడించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్దేశిత లక్ష్యాలను కాంట్రాక్టు రెన్యువల్‌కు ముడిపెట్టడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాన్ని నమ్ముకుని పనిచేస్తున్న కొంత మంది ఎఫ్‌ఏలు డిమోషన్ అవడమే కాకుండా... తమ ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతుందన్న ఆందోళనలో సమ్మెకు వెళ్లారని పేర్కొన్నారు. వైరస్ ప్రభావం వల్ల గ్రామాల్లో ఉపాధి కూలీలకు పనులు కల్పించాల్సిన అవసరం ఉందని...ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమ్మెను బేషరుతుగా విరమిస్తూ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తక్షణమే విధుల్లోకి చేర్చుకోవడం ద్వారా 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కుటుంబ సభ్యులకు న్యాయం చేసినట్లు ఉంటుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ పట్టించుకోని పాస్టర్లు... అరెస్టు చేసిన పోలీసులు