అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఏపీ సీఎం జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇటీవల వాదనలు పూర్తయ్యాయి. దీనిపై రేపు సీబీఐ న్యాయస్థానం తుది ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఈ కేసుపై విచారణ జరుగుతుండగానే తన పిటిషన్‌ను కొట్టివేశారంటూ వార్తలు ప్రచారం కావడంపై రఘురామ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో రఘురామ హైకోర్టును ఆశ్రయిస్తూ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేసును హైదరాబాద్, తెలంగాణలోని ఇతర క్రిమినల్ కోర్టుకు బదిలీ చేయాలని.. దీనిపై మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. రఘురామ పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30గంటల తర్వాత విచారణ జరగనుంది.
ఇదీ చూడండి: RRR: 'కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలి'