ETV Bharat / state

'అమరావతి రాజధానిని మహిళలే కాపాడాలి' - అమరావతి రైతులకు రఘురామకృష్ణరాజు మద్దతు వార్తలు

అమరావతి రాజధాని కాపాడుకునే పోరాటం మహిళలే ముందుండి నడపాలని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మహిళా నాయకత్వానికి మచ్చుతునకలైన రాణిరుద్రమ, అబ్బక్క.. వంటి వీరనారీమణుల స్ఫూర్తిగా ముందుకు సాగాలని కోరారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్​ను ఆదర్శంగా తీసుకుని పోరాడాలని సూచించారు.

mp raghu ramakrishnaraju about amaravathi
'అమరావతి రాజధానిని మహిళలే కాపాడాలి'
author img

By

Published : Aug 3, 2020, 9:49 PM IST

అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్​మెంట్​ అథారిటీ పేరుతో రైతులను దగా చేసే ప్రయత్నం జరుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. సీఆర్డీఏ ద్వారా రైతులకు వచ్చిన అధికారాన్ని కాలరాసేందుకు ప్రభుత్వమే కుట్ర పన్నుతోందని విమర్శించారు. ప్రభుత్వం చేసిన కొత్త చట్ట సవరణ ద్వారా రైతులకు దక్కేది గుండుసున్నా అని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు అనేది కేవలం కంటితుడుపు వివరణ అని చెప్పారు. కొత్త రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఉందన్నారు. ఒకే రాజధానిలో రాజ్​భవన్, హైకోర్టు, అసెంబ్లీ వంటి భవనాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని స్పష్టంగా ఉందన్నారు. ఆ మేరకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని రఘురామకృష్ణరాజు చెప్పారు.

'రైతులకు న్యాయం చేయాలంటే సుమారు 80, 90 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు బదులు 4, 5 వేల కోట్లతో అమరావతి రాజధాని పూర్తిచేయవచ్చు. కృష్ణా గుంటూరు జిల్లాల తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రాజీనామా చేయడం కంటే రాజీలేని రాజకీయ పోరాటం చేయడం అవసరమని పవన్ కళ్యాణ్ గుర్తించాలి. బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆలోచన మానుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగాలని అని సూచిస్తున్నా' అని రఘురామకృష్ణరాజు అన్నారు.

ముఖ్యమంత్రి గారూ! మనస్సాక్షిని నమ్మండి... రిఫరెండం పెట్టి ప్రజల ఆలోచన తెలుసుకోండి. ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పెన్షన్ 250 రూపాయలు పెంచేందుకు మన దగ్గర డబ్బు లేనప్పుడు వేల కోట్లతో మూడు రాజధానుల నిర్మాణం ఎలా సాధ్యం? కేవలం సంక్షేమ పథకాలు నమ్మి మనకు ఓట్లు వస్తాయని భ్రమించి ప్రజాభీష్టాన్ని నిర్లక్ష్యం చేయకండి. విలువలకు కట్టుబడి నేను రాజీనామా చేయాలని కోరుతున్న వైసీపీ నేతలు.. అదే విలువల కోసం మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధపడతారా?

-రఘురామకృష్ణరాజు, ఎంపీ

మీరు రాజీనామా చేయండి

రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. ఆందోళనకు గురికావద్దని రఘురామకృష్ణరాజు అన్నారు. ఎమ్మెల్యేలు అందరూ వారి వారి నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితి తెలుసుకుని ముఖ్యమంత్రికి వివరిస్తే ఆయన మనసు కరుగుతుందని నమ్ముతున్నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తామన్న మేరకు ముందుకు వెళితే అభివృద్ధి సాధ్యం కానీ.. మూడు రాజధానుల వల్ల సాధ్యం కాదన్నారు. 151 స్థానాలు గెలుచుకున్న మీరు రాజీనామా చేసి ప్రజల వద్దకు రిఫరెండం కోసం వెళ్తే 175 కు 175 స్థానాలు మీరే గెలుచుకోవచ్చన్న రఘు.. ఇది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నేను ఇచ్చే సూచనే తప్ప.. పార్టీకి, పార్టీ అధ్యక్షుడికి కాదని వ్యాఖ్యానించారు.

నిమ్మగడ్డలా పోరాడాలి

తిరిగి బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్​కు రఘురామకృష్ణరాజు అభినందనలు తెలిపారు. రమేష్ కుమార్​ని అమరావతి రైతులు ఆదర్శంగా తీసుకొని పోరాడాలన్నారు. న్యాయస్థానాల్లో పోరాడితే రాజధాని మహిళలకు న్యాయం జరుగుతుందని సూచించారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు.. విజ్ఞప్తి పత్రాలతో సీఎం దగ్గరికి వెళితే న్యాయం జరుగుతుందన్నారు. తనకు సెక్యూరిటీ వచ్చిన తర్వాత అమరావతి వెళ్లి.. మహిళలు, రైతుల వెనక ఉండి పోరాటం చేస్తానన్నారు. అమరావతిలో చనిపోయిన రైతులను ముఖ్యమంత్రి జగన్ వెళ్లి ఓదారిస్తే బాగుటుందని రఘురామకృష్ణా రాజు అన్నారు.

ఇదీ చదవండి: ఎస్ఈసీగా ‌మరోసారి బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేశ్​‌ కుమార్

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.