తాను స్థాపించిన మధుకాన్ గ్రూపు ఆఫ్ కంపెనీ(Madhucon Group of Companies) బ్యాంకులకు సొమ్ము ఎగవేసిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఖమ్మం ఎంపీ, లోక్ సభలో తెరాస పక్షనేత నామా నాగేశ్వర్ రావు(Nama Nageswara rao) స్పష్టం చేశారు. ఈడీ సోదాలు, ఆర్థిక అవకతవకల వ్యవహారంలో కంపెనీ చిక్కుకున్న పరిస్థితులను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో వివరించారు. తమ కంపెనీపై ఎవరూ కంప్లైంట్ చేయలేదని స్పష్టం చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో వేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం వల్ల తమకు ఎన్హెచ్ఏ ప్రాజెక్టు(NHA Project) నుంచి కొన్ని కంపెనీలను విరమించారని ఆయన పేర్కొన్నారు. ఈడీ దర్యాప్తుకు సహకరిస్తామని.. ఎవరెన్నీ ప్రలోభాలకు పాల్పడినా తాను తలొగ్గనని.. తాను కేసీఆర్(KCR) వెన్నంటే ఉంటానని స్పష్టం చేశారు. నీతి, నిజాయతీలకు కట్టుబడే వ్యాపారం, రాజకీయాలు చేశానని నామా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన బలమని... ఖమ్మం ప్రజలే తన బలగమని ధీమా వ్యక్తం చేశారు.
జార్ఖండ్ రాష్ట్రంలో జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టులో మధుకాన్ గ్రూపు(Madhucon Group of Companies) ఆస్తుల మళ్లింపు అంశం ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుగుతోందని నామా వెల్లడించారు. జాతీయ రహదారుల అథారిటీతో కలిసి తాము చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు ఎన్హెచ్ఏ(NHA) సకాలంలో ఇవ్వాల్సిన సైట్ ఇవ్వనందువల్లే.. ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయామని పేర్కొన్నారు. తద్వారా తాము ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.485 కోట్లు, ఎస్క్రూ అకౌంట్ ద్వారా బ్యాంకు మంజూరు చేసిన రూ.685 కోట్లు ప్రాజెక్టుకు ఖర్చు చేశామన్నారు. వడ్డీల ద్వారా మరో రూ.378 కోట్లు కలిపి తామే రూ.1,030 కోట్లు బాకీ పడ్డామని నామా తెలిపారు. 60 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టును ఎన్హెచ్ఏ మధ్యలోనే రద్దు చేసిందన్నారు. ఈ క్రమంలో తామే చాలా నష్టపోయామని.. ఈ వ్యవహారాన్ని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్(Arbitral Tribunal)లో సవాలు చేసినట్లు నామా తెలిపారు. ఎస్క్రూ అకౌంట్(Escrow Account) ద్వారా తీసుకున్న సొమ్ముపై కంపెనీకి చెక్ పవర్ ఉండదని.. ప్రాజెక్టు పనుల నిమిత్తం బ్యాంకే ఫండ్‌గా విడుదల చేస్తుందని వెల్లడించారు. కాబట్టి తాము బ్యాంకులకు ఎగవేశామనే ఆరోపణలు తగవన్నారు.
చైనా సరిహద్దులు, కొంకన్ రైల్వే వంటి జాతీయ ప్రాజెక్టుల్లో పనులు పూర్తి చేసిన ఘనత మధుకాన్ గ్రూపు కంపెనీకి ఉందని.. తమ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకే ఈ వ్యవహారంలోకి లాగారాని ఆయన ఆరోపించారు. గత రెండు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని.. 2004 లోనే కంపెనీకు చెందిన డైరెక్టర్ సహా అన్ని హోదాల నుంచి వైదొలిగినట్లు తెలిపారు. అనంతరం తన సోదరులకు కంపెనీ బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం చేశారు. ఈడీ దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తామని.. ఆర్బిటరీ ట్రిబ్యునల్(Arbitral Tribunal)లో కంపెనీకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినా.. తాను వెరువనని.. ఏదేమైనా తాను కేసీఆర్(KCR) వెన్నంటే ఉంటానన్నారు.
ఇదీ చూడండి: Nama Nageswara Rao: మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు..