Adipurush Tickets 10,000 to be Given Free in Telangana : ఆదిపురుష్ చిత్ర ప్రదర్శనపై నిర్మాత అభిషేక్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఆదిపురుష్’ సినిమా టికెట్లను 10 వేల మందికిపైగా ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 10వేలకు పైగా టికెట్లు ఉచితంగా ఇస్తానని అభిషేక్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి మాత్రమే ఈ టికెట్లు ఉచితంగా అందివ్వనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారిని ఈ https://bit.ly/CelebratingAdipurush… గూగుల్ ఫామ్‌ని పూర్తి చేయాల్సిందిగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ కోరారు.
చెడు ప్రచారాన్ని అడ్డుకొని ఆదిపురుష్‌కు సహకరించండి : సంబంధిత వివరాలు నమోదు చేస్తే తాము టికెట్లు పంపిస్తామని అభిషేక్ తెలిపారు. సందేహాలకు 95050 34567 నంబరుకు ఫోన్ చేయొచ్చన్నారు. 'ఈ జూన్‌లో అత్యంత గొప్ప వ్యక్తి మర్యాద పురుషోత్తముని స్మరించుకుందాం. ఆదిపురుష్ వేడుకలు చేసుకుందాం. శ్రీరాముడి ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈతరం ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన దివ్య అడుగుజాడలను అనుసరించాలి' ఈ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు 'ఆదిపురుష్' చిత్రంపై దుష్ప్రచారం జరుగుతోందని ఆ చిత్రబృందం తెలిపింది. థియేటర్లలో ఎస్సీలకు ప్రవేశం లేదంటూ జరుగుతున్న దుష్ర్పచారాన్ని చిత్రబృందం ఖండించింది. సమానత్వం కోసమే ఆదిపురుష్ బృందం శ్రమించిందని... ఈ చిత్రం ప్రతి భారతీయుడిదని.. చెడు ప్రచారాన్ని అడ్డుకొని ఆదిపురుష్‌కు సహకరించండని చిత్ర బృందం సినీ అభిమానులను కోరింది.
జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆదిపురుష్ : రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో దర్శకుడు ఓంరౌత్ 3డీలో రూపొందిన చిత్రమిది. ఇందులో హీరో ప్రభాస్ రాఘవుడిగా, హీరోయిన్ కృతి సనన్ జానకిగా నటించారు. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర పోషించారు. హనుమంతుడిగా సన్నీసింగ్ కనిపించనున్నారు. ఓం రౌత్ దర్శకుడు. భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మించారు. టీజీ విశ్వప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 16న తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు చిత్ర బృందం.. ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లలో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. ‘కార్తికేయ 2’, ‘ది కశ్మీర్ ఫైల్స్’వంటి హిట్ చిత్రాలను నిర్మించిన అభిషేక్.. ‘ఆదిపురుష్’ సినిమాలో భాగమయ్యారు.
ఇవీ చదవండి: