'ప్రజా గొంతుకలను కట్‌చేయడమే మీ లక్ష్యమంటూ' ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(Seethakka in Assembly sessions 2021) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో గ్రామపంచాయతీల గురించి పలు ప్రశ్నలు సంధించిన సీతక్క... తాను కేవలం ప్రశ్నలే అడిగానని... రాజకీయం మాట్లాడడం లేదని అన్నారు. వాస్తవ పరిస్థితిపై మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె డీవీయేట్ అవుతున్నారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ప్రశ్న వేరుందని పేర్కొన్నారు. మాట్లాడే భాష కరెక్టుకాదని.. ప్రశ్నకే పరిమితం కావాలని స్పీకర్ సూచించారు.
సీతక్క ఆగ్రహం
సభలో ఆగ్రహానికి గురైన సీతక్క... తాను ప్రశ్నకే పరిమితమయ్యాయని అన్నారు. ప్రజా గొంతుకలను కట్‌చేయడమే లక్ష్యమంటూ ఆరోపించారు. గ్రామపంచాయతీలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంట్ ఎంత ఉందని ఆమె ప్రశ్నించారు. ఈమధ్యకాలంలో చాలామంది సర్పంచులు మానసిక ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక... ప్రభుత్వ గ్రాంట్లు నెలనెలకు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఇస్తున్నారు? రాష్ట్రం నుంచి ఎన్ని కేటాయిస్తున్నారు. చిన్నచిన్న పంచాయతీలకు ఇచ్చేటువంటి రూ.30, రూ.40 వేలు సరిపోతున్నాయా?. గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిధులు సరిపోతున్నాయా? అని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి.
-ఎమ్మెల్యే సీతక్క
ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇస్తున్న రూ.15,738 కోట్లను గ్రామపంచాయతీలకు రాకుండా డైవర్ట్ అయినట్లు తెలుస్తోందని.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇదిలాఉండగా రాష్ట్ర సర్పంచులు దేశంలోనే తలెత్తుకుని తిరుగుతున్నారని సీఎం కేసీఆర్ శాసనసభ సమావేశాల్లో (KCR in assembly sessions 2021) పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో సగటున రూ.4 గ్రాంటు విడుదల చేశారని గుర్తు చేశారు. తెరాస హయాంలో రూ.650కి పైగా విడుదల చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. మన గ్రామాలను చూసి పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయన్న కేసీఆర్.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో సభ్యులకు తెలియదా? అని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే కేంద్రం నిధులు విడుదల చేస్తోందని ప్రకటించారు. కొన్నిచోట్ల వనరులు ఉంటాయి.. మరికొన్నిచోట్ల వనరులు ఉండవని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భూముల అమ్మకం ద్వారా ఆదాయం సమకూరుతుందని ఉద్ఘాటించారు. అన్ని పంచాయతీలకు సమన్యాయం జరగాలని ఆలోచిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: Harish Rao in Assembly 2021: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు త్వరలోనే శ్రీకారం