sub committee on schools: ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన మంత్రివర్గ భేటీలో పాఠశాలల్లో మౌలిక వసతులపై చర్చించారు.
రాష్ట్రంలో జూన్ 12 కల్లా మన ఊరు-మన బడి అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మొదటి దశలో 50 శాతం పాఠశాలలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించేలా బడిబాట కార్యక్రమం చేపడతామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విద్యా బోధన, ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు అధికారులంతా కృషి చేయాలని మంత్రి తెలిపారు. వేసవి సెలవులు ఉన్నందున పనులను త్వరితగతిన పూర్తి చేసి పాఠశాలలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేలా చర్యలు తీసుకోవాలని.. కలెక్టర్లు పనులను పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.
'మన ఊరు- మన బడి' కింద 9 వేల పాఠశాలలను ఎంపిక చేశాం. దాదాపు రూ.3500 కోట్లు మొదటి విడతలో మంజూరు చేస్తాం. ఇప్పటికే 50 శాతం పాఠశాలలకు మంజూరు చేశాం. పాఠశాలల ప్రారంభం నాటికి అన్ని నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ఏడాది నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతన్నాం. టీచర్లకు ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఈ ఏడాది నుంచే 8వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో బోధన.
- సబిత ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ఐటీ, డిజిటల్ అంశాలపై మంత్రి కేటీఆర్ సూచనల అమలును పరిశీలిస్తామని సబితా వెల్లడించారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సమీక్షించడంతో పాటు పాఠశాలల ప్రారంభం వరకు పూర్తి చేయాల్సిన పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పనుల పూర్తి చేయడానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. జూన్ 12 నాటికి పాఠశాలల్లో అన్ని పనులు పూర్తిచేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
జూన్ 12న పాఠశాలలను పునఃప్రారంభం: జూన్ 12న పాఠశాలలను పునఃప్రారంభిస్తామని మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు సిద్ధమయ్యేలా పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని మంత్రి సబిత పిలుపునిచ్చారు. ఆట స్థలాలున్న పాఠశాలలకు క్రీడాసామగ్రి అందిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, నిరంజన్ రెడ్డి, దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: Minister Talasani : ఏపీ మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?