తెలుగు సినీహీరోలు చిరంజీవి, నాగార్జునలతో రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన ఈ భేటీలో... చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ, కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు.
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాల్లో స్థల సేకరణ చేయాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. కల్చరల్, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన భూమితో పాటు... సినీ, టీవీ కళాకారులకు ఇళ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని చూడాలని కూడా సూచించారు.
సింగిల్విండో విధానంలో షూటింగ్లకు త్వరితగతిన అనుమతులు... ఎఫ్డీసీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపడతామని తలసాని తెలిపారు. పైరసీ నివారణకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఆన్లైన్ టికెటింగ్ విధానం అమలు... ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత అంశాలను చర్చించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 15 ఏళ్ల ప్రయాణంలో అందమైన ప్రపంచాన్ని చూపించావ్..