మహిళలు, శిశువుల విషయంలో ఎలాంటి దాడులు జరిగినా దోషులను వదిలే ప్రసక్తి లేదని, కఠినంగా శిక్షిస్తామని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. ఇటీవల అమీన్పూర్ సంఘటన, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక మహిళ తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఇచ్చిన ఫిర్యాదు, మహిళలపై దాడులు జరిగితే వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, దాడులు జరగకుండా చేపట్టే నివారణ చర్యలు, అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య పరిరక్షణ చర్యలపై జిల్లాల అధికారులతో మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళలు, బాలల సంరక్షణ కేంద్రాలపై తనిఖీ పూర్తి చేసి నెలాఖరులోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న తనిఖీల తీరు, అధికారుల దృష్టికి వస్తున్న అనుభవాలను మంత్రి తెలుసుకున్నారు. అనాధాశ్రమాలకు పంపించే పిల్లల కుటుంబాల వద్దకు వెళ్లి వారిని ఆశ్రమాల్లో చేర్పించేందుకు గల కారణాలను తెలుసుకోవాలని సూచించారు.
పిల్లలను గురుకులాల్లో చేర్పించి సంరక్షించాలి..
తల్లిదండ్రులు ఉండి పిల్లలను ఆశ్రమాలలో చేర్పిస్తే, ఆ కుటుంబానికి ఉన్న ఇబ్బందులను గుర్తించాలని అన్నారు. ఆశ్రమాలలో చేర్పించే పిల్లల విషయంలో ఆరేళ్లు దాటిన వారైతే గురుకులాల్లో చేర్పించి సంరక్షించాలని, ఆరేళ్లలోపు వారైతే అంగన్ వాడీల ద్వారా కావల్సిన సహకారం అందించాలని సత్యవతి రాఠోడ్ తెలిపారు. హోమ్స్ నిర్వాహకులు వాటిని నడిపే కారణాలను కూడా లోతుగా విశ్లేషించాలన్న మంత్రి... సామాజిక సేవ పేరుతో పిల్లలను, మహిళలను ఆశ్రమాలలో పెట్టి ఇబ్బందులు పెడుతున్నట్లు దృష్టికి వస్తే వెంటనే ఆ ఆశ్రమాలను మూసివేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ నెలను పోషణ మాసంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అంగన్ వాడీ కేంద్రాలలోని పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పిల్లల బరువులను కొలిచి నివేదిక సమర్పించాలని అన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి అంగన్ వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్ పెంచాలని, ఇందుకు కావాల్సిన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.
సఖి కేంద్రాల్లో అధికారిని నియమించాలి..
ప్రతి అంగన్ వాడీ కేంద్రంలో స్థానిక అంగన్వాడీ అధికారి ఫోన్ నెంబర్లతో పాటు 100, 108, 181 నెంబర్లు, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారుల నెంబర్లను కూడా ప్రదర్శించాలని ఆదేశించారు. మహిళా సమస్యలకు పరిష్కారం ఇచ్చే సఖి కేంద్రాల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిని నియమించాలని, స్థానిక ఏసీపీ కూడా పర్యవేక్షించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పిల్లలను దత్తత తీసుకునే అంశంపై కూడా విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. చాలా మంది అవగాహన లేకుండా దత్తత కోరుతున్నారని అన్నారు. కొంతమంది దత్తత తీసుకుని పిల్లలను సరిగా చూసుకోవడం లేదని, దత్తత ఇచ్చేటప్పుడే తీసుకునే వారిపై సమగ్ర విచారణ చేయాలని సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా కోయిల్‌సాగర్'