Minister Puvvada on TSRTC AC Sleeper Buses : అత్యాధునికమైన హంగులు జోడించిన ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్‌ఆర్టీసీ తొలిసారి ప్రారంభించింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై సౌకర్యాన్ని ఈ బస్సులలో అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 16 బస్సులను కొనుగోలు చేయగా.. అందులో 9 బస్సులను ఇవాళ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చౌరస్తాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన బస్సులను పలు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నడపనున్నారు.
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈవీ బస్సులు : కొత్తగా 760 బస్సులకు ఆర్డర్ పెట్టగా.. వాటిలో 400లకు పైగా డిపోలకు చేరుకున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రైవేటు బస్సులకు దీటుగా ఈ లహరి బస్సులు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఈ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎండీ సజ్జనార్.. ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. త్వరలోనే విజయవాడ- హైదరాబాద్ మధ్య ఇంటర్ సిటీ బస్సులు కూడా ప్రవేశపెడతామని వెల్లడించారు.
'త్వరలో 1,300 ఈవీ బస్సులు తీసుకొస్తున్నాం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం. ఇప్పటికే ఆర్టీసీలో వీలైనంత సాంకేతికతను వాడుతున్నాం. రాబోయే రోజుల్లో మరికొన్ని బస్సులు తీసుకువస్తాం. ఆర్టీసీ ట్రాన్స్‌పోర్టేషన్ పెరగడానికి కృషి చేస్తాం. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. త్వరలో ఆక్యుపెన్సీ పెరుగుతుందని ఆశిస్తున్నాను. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. సజ్జనార్... సాంకేతికను వాడి ఆర్టీసీ ఆదాయం పెంచుతున్నారు.'-పువ్వాడ అజయ్‌కుమార్, రవాణా శాఖ మంత్రి
ఇవాళ 9 స్లీపర్ ఏసీ బస్సులు ప్రారంభించామని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించామన్న ఆయన.. బెంగళూరు, చెన్నై, తిరుపతికి స్లీపర్ బస్సులను నడిపిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఇటీవల ప్రారంభించిన 12 నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఈ ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులకు ‘లహరి- అమ్మఒడి అనుభూతి’గా సంస్థ నామకరణం చేసింది.
ఇవీ సదుపాయాలు :
- ఈ ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులలో ప్రయాణికుల భద్రతకు ట్రాకింగ్ సిస్టంతో పాటు ‘పానిక్ బటన్’ సదుపాయం కల్పించారు. ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉండేలా వీటిని రూపొందించారు.
- ఈ లహరి ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సు లోపల సెక్యూరిటీ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్- అలారం సిస్టమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రయాణికులకు సమాచారం అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టం లాంటి అత్యాధునిక హంగులను జోడించారు.
ఇవీ చదవండి: