సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, సీఎం కేసీఆర్ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంజినీర్లు, గుత్తేదారు, పలువురు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి... గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. వర్క్ చార్ట్ ప్రకారం నిర్మాణ పనులు శరవేగంగా, పూర్తి నాణ్యతతో జరగాలని సూచించారు.
నిర్మాణ వ్యయం
నూతన సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్యయం రూ.619 కోట్లుగా ప్రతిపాదించగా... రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలుత రూ.400 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం నమూనా ఆరు అంతస్తుల నుంచి ఏడు అంతస్తులకు పెంచడం వల్ల నిర్మాణ వ్యయం పెంచారు. మొత్తం ఏడు లక్షల చదరపు అడుగుల్లో ఏడు అంతస్తుల్లో నూతన సచివాలయ నిర్మాణం జరగనుంది. 2500 మంది కార్మికుల వసతి కోసం అధునాతన సౌకర్యాలతో పరిశుభ్రమైన వర్కర్స్ కాలనీ ఏర్పాటైందని... కాంక్రీటు కోసం నిర్మాణ ప్రాంతంలోనే రెడీమిక్స్ బ్యాచింగ్ ప్లాంటును ఏర్పాటు చేశారు. 200 పిల్లర్లు ఉంటాయని అన్నారు. ఒక్కో పిల్లర్‌ను 300 బస్తాల సిమెంట్‌తో 40 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, నాలుగు టన్నుల స్టీల్‌తో తయారు చేస్తున్నారు.
రాజస్థాన్ రాళ్లతో సోయగం
ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ నూతన భవనానికి రాజస్థాన్ రాళ్లతో సొగసులు అద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరే ఇక్కడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజస్థాన్‌లోని ధోల్పూర్ రాతితో నగిషీలు అద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. భవనం ముందు వైపున కిందిభాగంలో కొంత, పైభాగంలో కొంతమేర ఎరుపు రంగు రాతి పలకలను వినియోగించనున్నారు. భవనం మధ్య భాగంలో బీజ్ రంగు రాతి పలకలను వినియోగించేలా నమూనాలను రూపొందించారు. వీటితో భవనం మరింత ఆకర్షణీయంగా ఉంటుందని ఆర్కిటెక్ట్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. కొన్ని నమూనాలు చూపడంతో ఆయన సుముఖత వ్యక్తం చేశారు. పార్లమెంటు ఆవరణలో ఉన్నట్లే కొత్త సచివాలయంలోనూ భవనం ముందు కుడి, ఎడమ భాగాల్లో రెండు ఫౌంటెయిన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
సచివాలయ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఇప్పటికే పలుసార్లు పరిశీలించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి పనుల పురోగతిని తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: 'ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం.. అత్యవసర పరిస్థితి'