కూరగాయల సాగుకు మరింత ప్రోత్సాహంతో పాటు విత్తన సబ్సిడీ, యాంత్రీకరణలపై దృష్టి సారించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నగర అవసరాలకు అనుగుణంగా సమీప జిల్లాల రైతులను ప్రణాళికాబద్ధంగా ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు. మిద్దెతోటల పెంపకంపై అవగాహన కల్పించి... ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. దళారి వ్యవస్థను తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం మన కూరగాయలు పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఇతర పనిముట్లను రైతుబజార్లలో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రైతుల అనుసంధానం పెరగాలి
రైతు బజార్లలో కూరగాయల ధర నిర్ణయించేటప్పుడు పంట రకం, నాణ్యతను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. నగర సమీపంలో కూరగాయలు పండించే రైతులకు రైతుబజార్లతో అనుసంధానం పెరగాలని పేర్కొన్నారు. కూరగాయలు తరలించే ఆర్టీసీ సర్వీసులను వెంటనే ప్రారంభించాలని తెలిపారు. సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, మార్కెటింగ్ అదనపు డైరెక్టర్ రవికుమార్, వివిధ జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కంప్యూటర్ విద్యలో తెలంగాణ వెనకబాటు