హైదరాబాద్ నగరంలో మరికొన్ని కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలకు మంత్రి కేటీఆర్ (Minister Ktr) శంకుస్థాపన చేశారు. రూ.1,280.87 కోట్లతో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 17 కొత్త ఎస్టీపీ (Stp)లతో 376.5 ఎమ్మెల్డీల మురుగును శుద్ధి చేయవచ్చని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మరో 14 ఎస్టీపీలు, మొత్తం 31 ఎస్టీపీలు దశల వారీగా నిర్మిస్తున్నామని వెల్లడించారు. వీటి నిర్మాణంతో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఇదొక మైలురాయి అవుతుందని తెలిపారు.
ప్రజల సహకారం అవసరం...
మురుగును శుద్ధి చేయకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. ఎస్టీపీల నిర్మాణంతో మురుగు నీటి ప్రవాహాన్ని చెరువులు, కుంటల్లోకి రాకుండా అడ్డుకోవచ్చని తద్వారా ఆ చెరువులను అభివృద్ధి చేసి, పరిసర ప్రాంతాలను సుందరీకరించుకోవచ్చని పేర్కొన్నారు. మనకంటే మెరుగైన నగరాన్ని, జీవన ప్రమాణాలను మన భావితరాలకు అందించడం మన కర్తవ్యమని, అందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రజలు చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను నాలాల్లో, చెరువుల్లో వేయొద్దని పిలుపునిచ్చారు.
మురుగు శుద్ధి...
11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఎస్టీపీ ద్వారా నిత్యం 100.0 ఎమ్మెల్డీల మురుగు నీరు శుద్ధి అవుతుంది. బాలానగర్, జీడిమెట్ల, కూకట్పల్లి, సూరారం, జగద్గిరిగుట్ట నుంచి వచ్చే మురుగును ఈ ఫతేనగర్ ఎస్టీపీలో శుద్ధి చేస్తారు. 2036 ఏడాది వరకు ఇబ్బంది లేకుండా... 9.84 లక్షల జనాభాకు సరిపడా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఫతేనగర్ ఎస్టీపీలో శుద్ధి చేసిన మురుగు నీటిని కూకట్పల్లి నాలాలోకి విడుదల చేస్తారు. కాగా ఇప్పటికే జలమండలి నగరంలో 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తోంది. కొత్తగా నిర్మిస్తున్న 17 ఎస్టీపీలతో మురుగు నీటిని శుద్ధి చేసి కూకట్పల్లి నాలాలోకి విడుదల చేస్తారు. దీని వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా... పర్యావరణం, ప్రజారోగ్యంపై ఎలాంటి దుష్పలితాలు ఉండవు.
ఉద్యమంలా అభివృద్ధి...
సీఎం కేసీఆర్ ఒక ఉద్యమంలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడ జరగని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందని... మన దగ్గర ఉన్న పథకాలు 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో దళిత బందు పథకం ఎందుకు అమలు చేయడం లేదని... దళిత బందు పథకం పేదవారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
14 ఏళ్ల తర్వాత...
నగరంలో 14 ఏళ్ల తర్వాత ఇంత పెద్దఎత్తున ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నామని... మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని జలమండలి ఎండీ దానకిషోర్ (Jalamandali Md Danakishor) అన్నారు. రోజుకి 772 ఎంఎల్డీల మురుగు నీటిని 94 శాతం శుద్ధి చేస్తున్నామని... కొత్తగా నిర్మించే ఈ 31 ఎస్టీపీల ద్వారా మరింత మురుగు శుద్ధి చేయవచ్చని తెలిపారు. వీటి నిర్మాణంలో అధునాతన టెక్నాలజీని వాడుతున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: