రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉన్నందున.. సిమెంటు ధరలను తగ్గించి రియాల్టీ రంగానికి చేయూతనందించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి సిమెంటు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కంపెనీలు సిమెంట్ బస్తా ధరను తగ్గించాలని మంత్రులు కోరగా.. ఇందుకు సిమెంటు కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. తాము అంతర్గతంగా మాట్లాడుకొని ఏ మేరకు ధరను తగ్గించేది ప్రభుత్వానికి తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు మరో మూడేళ్ల పాటు.. గతంలో నిర్ణయించిన 230 రూపాయలకు బస్తా ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించాయి. సిమెంట్ కంపెనీలు పెద్ద ఎత్తున నెలకొని ఉన్న హుజూర్నగర్ పరిసర ప్రాంతాల్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. స్థానిక యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తామని మంత్రులు ప్రకటించారు.